
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోండి
తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
అనర్హతలపై నిర్ణయాధికారం స్పీకర్‌దేనని స్పష్టీకరణ
అలాగని తామెలాంటి ఆదేశాలూ ఇవ్వకపోతే ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్నట్టవుతుందని వ్యాఖ్య
అనర్హతల విషయంలో స్పీకర్‌కున్న నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలని సూచన
ఫిరాయింపులు అడ్డుకోకపోతే ప్రజాస్వామ్య పునాదులకే ముప్పంటూ ఆందోళన.... స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదన్న సర్వోన్నత న్యాయస్థానం
స్పీకర్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ రాజ్యాంగపరమైన రక్షణ పొందలేరని వెల్లడి
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం తుది తీర్పు
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లక్ష్యాన్ని నీరుగార్చుతుంది. అలాగని మేం ఇప్పుడు ఏ ఆదేశాలూ జారీ చేయకపోతే.. ‘ఆపరేషన్ సక్సెస్–పేషెంట్ డెడ్’ అన్నట్లుగా ఉంటుంది. స్పీకర్ తన ప్రస్తు త వైఖరిని పునరావృతం చేయడానికి దోహదపడినట్లు అవుతుంది..
– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం శాసనసభ స్పీకర్‌కే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణలో పార్టీ మారి అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో తీర్పు వెలువరించిన రోజు నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సభాపతి కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడాన్ని అనుమతించకూడదని పేర్కొంది. విచారణను ఆలస్యం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని చెప్పింది. మరోవైపు అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలని సూచించింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
ఏడు నెలలు.. 9 సార్లు విచారణ
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 15న బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పి) దాఖలు చేశారు.
మిగిలిన ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత దాదాపు ఏడు నెలల్లో తొమ్మిది సార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, మోహిత్ రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, తదితరులు వాదనలు వినిపించారు. గత ఏప్రిల్ 3న విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం.. గురువారం తీర్పు వెలువరించింది.
ఎంత సమయం కావాలని ముందే అడిగాం..
‘2025 జనవరి 15న సుప్రీంకోర్టు ముందు కేసు దాఖలైన తర్వాత 16న తొలిసారిగా మేం కొందరికి నోటీసులు జారీ చేశాం. ఫిబ్రవరి 3న జరిగిన విచారణ సందర్భంగా.. ఫిబ్రవరి 4న మరికొందరికి నోటీసులు జారీ చేశాం. జనవరి 31న తొలుత ఈ కేసు విచారణకు వచ్చినప్పుడే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు ఎంత సమయం అవసరమో తెలుసుకోవాల్సిందిగా మేము సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి సూచించాం..’ అని ధర్మాసనం తెలిపింది.
‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’లా ఉండాలి
‘10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా పని చేస్తున్నప్పటికీ, ఆయన ఎటువంటి రాజ్యాంగపరమైన రక్షణ (కానిస్టిట్యూషనల్ ఇమ్యూనిటీ)ను పొందలేరు. నిజానికి ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి అనర్హత పిటిషన్లపై విచారించేందుకు సమయాన్ని నిర్ణయించమని స్పీకర్‌కు సూచించారు. అందుకు నాలుగు వారాల గడువిచ్చారు. అంతేకానీ పిటిషన్లపై నిర్ణయం తీసుకోమని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.
అయినప్పటికీ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం ద్వారా డివిజన్ బెంచ్ తప్పిదానికి పాల్పడింది. ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు లేకపోయినా తెలంగాణ శాసనసభ కార్యదర్శి సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయడం సరైంది కాదు. ఇకపై ఈ కేసు ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’ లా ఉండాలి..’ అని సుప్రీంకోర్టు (నవ్వుతూ) వ్యాఖ్యానించింది.
విచారణను పొడిగించేందుకు అనుమతి వద్దు
‘అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను పొడిగించడానికి స్పీకర్ అనుమతించకూడదు. స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షకు అధికారాలు (కిహోటో హోల్లొహన్ (10వ షెడ్యూల్ సమర్థించిన) కేసులో తీర్పు నిష్పత్తిని ప్రస్తావిస్తూ) ఇరుకైన పరిధిలో (న్యారో కంపాస్) ఉన్నాయి. అలాగే స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదు.
స్పీకర్లు అనర్హత పిటిషన్లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచే పరిస్థితిని రాజ్యాంగ ధర్మాసనం ఊహించి ఉండకపోవచ్చు. అనర్హత పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయించాలని కీషమ్ మేఘచంద్ర సింఘ్ కేసులో తీర్పు ఉంది. శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పిటిషన్లను నిరీ్ణత సమయంలోగా నిర్ణయించాలని మహారాష్ట్ర స్పీకర్‌కు జారీ అయిన ఆదేశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది..’ అని న్యాయమూర్తులు తెలిపారు.
జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం
‘అనర్హత పిటిషన్లపై నిర్ణయాధికారం స్పీకర్‌కే ఇచ్చాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్ తగిన సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. మనం దీనిని ఎదుర్కొనకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.
అనర్హతల విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. వీటిని ఎదుర్కొనకపోతే మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. 10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ..ఆయన ఎటువంటి ‘‘రాజ్యాంగపరమైన రక్షణ’’ని పొందలేరు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పొడిగించుకుంటూ పోవడానికి వీల్లేదు..
– సుప్రీంకోర్టు ధర్మాసనం
బీఆర్‌ఎస్ నేతల అభ్యర్థన తోసిపుచ్చిన ధర్మాసనం
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కిహోటో హోల్లోహన్, సుభాష్ దేశాయ్ తదితరుల కేసులకు సంబంధించి రాజ్యాంగ బెంచ్ తీర్పును ప్రస్తావించింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని స్పష్టం చేసింది.
‘అయితే, ఫిరాయింపులు జరిగినప్పుడు అనర్హత అంశాన్ని తేల్చే ముఖ్యమైన బాధ్యతను స్పీకర్‌కు లేదా చైర్మన్‌కు అప్పగించే యంత్రాంగం వల్ల రాజకీయ ఫిరాయింపులను సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నామా.. లేదా? అనే అంశాన్ని మాత్రం పార్లమెంట్ పరిశీలించాలి. ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలంటే, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే ప్రస్తుత యంత్రాంగం సరిపోతుందా? లేదా? అనే విషయం కూడా పార్లమెంటే తేల్చాలి..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
అనర్హత పిటిషన్లపై తేల్చే అత్యంత ముఖ్యమైన బాధ్యతను పార్లమెంట్ స్పీకర్‌కు అప్పగించినప్పుడు ఆ హోదాలో ఉన్నవారు ఎంతవేగంగా చర్యలు తీసుకున్నారనేది ప్రధానమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
షెడ్యూల్ 10 ఏం చెబుతోంది..
ఇది పార్టీల నుంచి ఫిరాయింపులను నిరోధించడానికి రూపొందించింది. దీన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా అంటారు. రాజకీయ స్థిరత్వం, ప్రజాస్వామ్య ప్రక్రియ పరిరక్షణ, విలువలను కాపాడటం కోసం దీన్ని ఉద్దేశించారు.
ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారం..పార్టీ ఆదేశాలు చట్టసభల సభ్యులు పాటించాలి. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా లేదా పార్టీ నుంచి వైదొలిగినా చట్టసభల సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చు.
ఫిరాయింపుల అంశాల్లో కోర్టులకు అధికార పరిధి ఉండదు. స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయమే అంతిమం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరితే సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు. ఒకవేళ ఒక పార్టీ మరో పార్టీలో పూర్తిగా విలీనమైతే అనర్హత వర్తించదు. సభ్యుని అనర్హతపై ఏ కోర్టుకు అధికార పరిధి ఉండదు.