
గవర్నర్లు విధులు నిర్వర్తించడంలో విఫలమైతే మేము చూస్తూ కూర్చోవాలా?
ప్రశ్నించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం
రాష్ట్రపతి రిఫరెన్స్‌పై తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి తాము కాపలాదారులమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. గవర్నర్లు విధులు నిర్వర్తించడంలో విఫలమైతే తాము నిశ్శబ్దంగా చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించింది. పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేసే విషయంలో రాష్ట్రపతి/గవర్నర్లకు గడువు నిర్దేశించే అధికారం న్యాయస్థానాలకు ఉందా? అనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ వ్యవహారంపై 10 రోజులపాటు కొనసాగిన విచారణ గురువారం ముగిసింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పార్లమెంట్ లేదా శాసనసభల నుంచి వచ్చిన బిల్లులపై రాష్ట్రపతి/గవర్నర్లు మూడు నెలల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందేహాలు లేవనెత్తారు.
రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి/గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. కోర్టును ప్రశ్నించడానికి ఆర్టికల్ 143(1) కింద తనకున్న అధికారాలను వాడుకున్నారు. సుప్రీంకోర్టుకు మొత్తం 14 ప్రశ్నలు సంధించారు. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాజ్యాంగంలోని ఆరి్టకల్ 200, 201 కింద రాష్ట్రపతి/గవర్నర్లకు ఉన్న అధికారాలపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రిఫరెన్స్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 19వ తేదీన ప్రత్యేక విచారణ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సీనియర్ లాయర్లు వాదించారు.
వ్యతిరేకించిన విపక్ష పాలిత రాష్ట్రాలు
రాష్ట్రపతి రిఫరెన్స్‌ను విపక్ష పాలిత తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులపై రాష్ట్రపతి/గవర్నర్లు నిర్ణీత గడువులోగా సమ్మతి తెలియజేయడమో లేక వెనక్కి పంపించడమో జరగాల్సిందేనని పేర్కొన్నాయి. బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం సరైంది కాదని స్పష్టంచేశాయి.
రాష్ట్రపతి రిఫరెన్స్‌ను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరాయి. కానీ, రాష్ట్రపతి అభ్యంతరాలను బీజేపీ పాలిత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, గోవా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సమరి్థంచాయి. కేరళ, తమిళనాడు ప్రభుత్వాల తరఫున కె.కె.వేణుగోపాల్, కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. రాష్ట్రపతి అభ్యంతరాలను వ్యతిరేకించారు. ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. గడువు నిర్దేశించే అధికారం కోర్టులకు ఉందని తేల్చిచెప్పారు.
ఆ అధికారం కోర్టులకు లేదు: తుషార్ మెహతా
రాజ్యాంగం ప్రకారం.. వేర్వేరు వ్యవస్థలకు వేర్వేరు ప్రత్యేక అధికారాలు ఉంటాయని తుషార్ మెహతా గురువారం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రపతి/గవర్నర్లకు రాజ్యాంగం ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని, రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో అదొక భాగమని స్పష్టంచేశారు. గవర్నర్ల విచక్షణాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు. వారికి టైమ్‌లైన్ విధించే అధికారం కోర్టులకు లేదని స్పష్టంచేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్ స్పందించారు. ‘‘రాజ్యాంగానికి మేము కాపలాదారులం. రాజ్యాంగం ప్రకారం వేర్వేరు వ్యవస్థలకు వేర్వేరు అధికారాలు ఉంటాయన్న విషయం నిజమే.
న్యాయ వ్యవస్థ కూడా తనకున్న అధికారాలతో చురుగ్గా వ్యవహరిస్తోంది. అదేసమయంలో జ్యుడీíÙయల్ టెర్రరిజం, అడ్వెంచరిజం ఉండాలని మేము చెప్పడం లేదు. కానీ, ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ సక్రమంగా విధులు నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ కాపలాదార్లు ని్రష్కియాత్మకంగా ఉండిపోవాలా? అధికారాలు ఉపయోగించుకోకుండా చూస్తూ కూర్చోవాలా?’’అని ప్రశ్నించారు. దీనిపై తుషార్ మెహతా బదులిచ్చారు.
కేవలం కోర్టులే కాకుండా శాసన(లెజిస్లేచర్), కార్యనిర్వాహక వర్గం(ఎగ్జిక్యూటివ్) కూడా ప్రజల ప్రాథమిక హక్కులకు కాపలాదారులేనని స్పష్టంచేశారు. ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాణాన్ని ఉల్లంఘించేలా ఎవరూ వ్యవరించకూడదని చెప్పారు. మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్ నడుచుకోవాలన్న వాదనను తుషార్ మెహతా ఖండించారు. భారతదేశంలో తాము అంతర్భాగం కాదంటూ ఏదైనా ఒక రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఆమోదిస్తే దానికి కూడా గవర్నర్ సమ్మతి తెలియజేయాలా? అని ప్రశ్నించారు. అలాంటి సందర్భాల్లో బిల్లును పెండింగ్‌లో పెట్టడం తప్ప గవర్నర్‌కు మరో మార్గం ఉండదన్నారు.