తమ కంటి దీపాలు హఠాత్తుగా కనుమరుగైనప్పుడు తల్లితండ్రులకు ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలినట్టవుతుంది. తమ పంచప్రాణాలనూ ఎవరో పిండేసినట్టు విలవిల్లాడిపోతారు. ఢిల్లీ శివారులో ఉన్న నోయిడా సమీపంలోని నిఠారి గ్రామంలో 19 ఏళ్ల క్రితం జరిగింది ఇదే.
తప్పిపోయిన పిల్లలు ఇద్దరు దుర్మార్గుల చేతుల్లో కడతేరి పోయారని దర్యాప్తు అనంతరం సీబీఐ తేల్చి, న్యాయస్థానం ఉరిశిక్షలు కూడా విధించాక... దాదాపు రెండు దశాబ్దాలు గడిచాక కేసు వీగిపోతే? ఈ కేసులో ఒక దోషి వ్యాపారవేత్త మణిందర్ సింగ్ పంథేర్ లోగడే నిర్దోషిగా బయటపడగా... పదమూడు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని 12 కేసుల్లో నిర్దోషిగా తేలి, ఒక కేసులో మాత్రం యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మరో దోషి సురేందర్ కోలీ సైతం నిరపరాధేనని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది.
శిక్షలు పడినప్పుడు, మరీ ముఖ్యంగా ఉరిశిక్ష పడిన తీవ్రమైన కేసుల్లో కేవలం ఊహల ఆధారంగా దోషాన్ని నిర్ధారించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో కేవలం కోలీ ఒప్పుకోలు ప్రకటన, కూరగాయలకు ఉపయోగించే చాకు తప్ప సాక్ష్యాధారాలెక్కడని ప్రశ్నించింది.
జాతీయ స్థాయిలో పతాకశీర్షికలకెక్కిన ఈ కీలక కేసు విషయంలో పేలవమైన దర్యాప్తు సాగిందంటే ఎవరిని నిందించాలి? 2006 చివరిలో వెల్లడైన ఈ ఉదంతం దేశం మొత్తాన్ని కుదిపేసింది. మొదట 8 మంది ఆడపిల్లలకు సంబంధించినవిగా భావించిన మానవ కంకాళాలు మురికి కాల్వలో లభ్యమైనప్పుడు అంతకు రెండు మూడేళ్ల ముందు మాయమైన తమ పిల్లలకు సంబంధించినవే కావొచ్చని పేద కుటుంబాలు తల్లడిల్లాయి. ఛానెళ్లు అంతంత మాత్రంగానే ఉన్న ఆ కాలంలో కూడా మీడియాలో వెలువడే కథనాలు చదివి, విని దేశం దిగ్భ్రాంతి చెందింది.
పిల్లల్ని ప్రలోభపెట్టి తీసుకెళ్లి అత్యాచారాలు చేసి హతమార్చారని, అందులో ఒక టీనేజ్ యువతి కూడా ఉందని దర్యాప్తులో వెల్లడైంది. మొత్తంగా 22 మంది కంకాళాలు దొరికాయని అప్పట్లో చెప్పారు. తాను ఆరుగురు పిల్లలపై, ఒక యువతిపై అత్యాచారాలు జరిపి హతమార్చానని కోలీ తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారంతో ఇంటి సమీపంలో తవ్వినప్పుడు మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. ఈ వ్యవహారంలో అపహరణ, అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాల ధ్వంసం మాత్రమే కాక నరమాంస భక్షణ, శరీరాంగాల కోత, శవసంభోగం వగైరాలున్నాయి.
ఇందుకు ఒక డాక్టర్ సహకరించాడని అరెస్టు చేయగా, అతనిపై మొదట్లోనే కేసు వీగి పోయింది. హతమార్చటానికి ముందు ఈ పసిపిల్లలతో నీలిచిత్రాలు తీశారన్న కథనా లొచ్చాయి. పంథేర్ ఇల్లు ‘భయంకరమైన కొంప’గా ముద్రపడింది. 12 కేసుల్లో కోలీని దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించారు. వాటన్నిటినీ అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మరో కేసులో సైతం ఇప్పుడు నిర్దోషిగా బయటపడ్డాడు. పదిహేనేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో పంథేర్ 2009లో విడుదలయ్యాడు.
న్యాయస్థానాలు ఒక రకంగా నిస్సహాయమైనవి. దర్యాప్తు తీరును కూలంకషంగా పరిశీలించి, నిందితులపై ఉన్న సాక్ష్యాధారాలేమిటో చూసి తీర్పునిస్తాయి తప్ప మీడియా కథనాలనుబట్టో, దర్యాప్తు సంస్థల లీకుల ఆధారంగానో వ్యవహరించవు. ఈ కేసులో ప్రశ్నార్థక ఒప్పుకోళ్లు, వాటి ఆధారంగా మీడియా సంచలన కథనాలే తప్ప దర్యాప్తు సక్రమంగా జరగలేదని ధర్మాసనం వెలువరించిన తీర్పే చెబుతోంది. ఏమాత్రం పసలేని ఆరోపణల ఆధారంగా కోలీకి శిక్ష విధిస్తే న్యాయవిఘాతం చేసినవారమవుతామనీ, న్యాయప్రమాణాలకు ఈ ఆధారాలు ఏమాత్రం నిలబడలేవనీ న్యాయమూర్తులు అనటం గమనార్హం.
నేర నిర్ధారణలో ఎంతో అభివృద్ధి సాధించిన ఈ దశలో కూడా దేశం మొత్తాన్ని కుదిపేసిన కేసులో వైఫల్యం చెందటం దురదృష్టకరం. పంథేర్, కోలీలిద్దరూ నిర్దోషులు సరే... మరి అసలు హంతకులెవరు? వారు ఇప్పటికీ చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్నారనుకోవాలా? కనీసం దేశవ్యాప్తంగా దర్యాప్తు విభాగాలన్నీ ఈ ఉదంతాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి మున్ముందు మరింత జాగరూకతతో మెలగటం అవసరమని గుర్తిస్తే మంచిది.


