నకిలీ స్టాంప్ పేపర్లు, రియల్టర్ మృతి కేసులో విచారిస్తున్న సీబీఐ
బెంగళూరు (బనశంకరి)/చిత్తూరు అర్బన్: రియల్టర్ అనుమానాస్పద మృతి, నకిలీ స్టాంప్ పేపర్లతో తప్పుడు వీలునామా సృష్టించిన కేసులో చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ దంపతుల కుమారుడు డీకే శ్రీనివాస్, కుమార్తె కల్పజను సీబీఐ అధికారులు సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన రియలర్ట్ కె.రఘునాథ్ 2019 మే నెలలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
తన భర్త మరణం వెనుక డీకే శ్రీనివాస్, అతని కుటుంబసభ్యులు ఉన్నారంటూ రఘునాథ్ భార్య మంజుల బెంగళూరులోని హెచ్‌ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. న్యాయస్థానం 2022లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. కల్పజ, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అలాగే అప్పట్లో హెచ్‌ఏఎల్ సీఐగా ఉన్న డీఎస్పీ మోహన్‌ను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.


