జనతంత్రం
మెడికల్ కాలేజీల ‘పీపీపీ’ మీద ఈరోజు (శనివారం) రెండు ముఖ్యమైన దినపత్రికల్లోని ఎడిట్ పేజీల్లో స్పందనలు కనిపించాయి. ఇందులో ‘ఈనాడు’ దినపత్రికలో వచ్చిన ఎడిటోరియల్ కాలమ్ ఒకటి. ఈ కాలమ్‌లో వెలువడే అభిప్రాయాలు పత్రిక పాలసీ కింద లెక్క. వార్తా కథనాలకు భిన్నంగా ఈ సంపాదకీయ కాలమ్‌లో చేసే విమర్శలు సైతం నిర్మాణాత్మకంగా ఉండాలని పాఠకులు ఆశిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అదొక సంప్రదాయం కూడా! ఈ కట్టుబాటును ‘ఈనాడు’ చాలాసార్లు ఉల్లంఘించింది. ప్రతిపక్ష నేత మీద పగతో ఆ సంపాదకీయం ఈ రోజున రగిలిపోయింది. సంపాదకీయ ప్రమాణాలను పాటించడం విషయంలో అది చిట్టచివరి జారుడు మెట్టుపై నుంచి కూడాకిందికి దొర్లింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదలైన మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతి రేకిస్తూ ఏపీలో కోటీ నాలుగు లక్షల మందికి పైగా తమ అడ్రస్, ఫోన్ నంబర్లు వేసి మరీ సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో మీడియాతో జగన్ మాట్లాడిన మాటలు కూటమిని ఇరుకున పెట్టాయి. ‘పీపీపీ’ ముసుగులో పెద్ద స్కామ్ దాగుందని ఆయన తొలి నుంచీ వాదిస్తున్నారు. ఆయన వాదనను మేధావులతో పాటు సామాన్య జనం సైతం విశ్వసిస్తున్నారు. అందుకు రికార్డు స్థాయిలో నమోదైన సంతకాలే సాక్ష్యం. మీడియాతో మాట్లాడి నప్పుడు జగన్ అదే విషయాన్ని చెప్పారు. ఈ స్కామ్‌లో పాలు పంచుకొనేవారిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచా రించి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇందులో అభ్యంతరకరమైన విషయం ఏమున్నది?
జగన్ మాటలు కాదు, ఆ మాటల వెనకున్న జనాభి ప్రాయం కూటమిని భయపెడుతున్నట్లున్నది. ప్రైవేట్ విద్యా వ్యాపారులు కూడా జనాభిప్రాయానికే జంకుతున్నారేమో! ఐదు కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కదానికి కూడా పడలేదు. ముఖ్యమంత్రికి ఆంతరంగికుడైన మంత్రి నారాయణ స్వయానా అతిపెద్ద చదువుల బేహారి. ఆయన కూడా ముందుకు రాక పోవడం ఏమిటి? ఇది ముమ్మూర్తులా స్కామ్ కనుక, ఇందులో దొరకడం ఖాయమని భయపడ్డారేమో!
ఆదోని కాలేజీకి ‘కిమ్స్’ యాజమాన్యం టెండర్ వేసిందని ముందు ప్రకటించారు. ఆస్పత్రి యాజమాన్యం ఖండించేసరికి, అందులో పనిచేస్తున్న దానయ్య ఎవరో దాఖలు చేశారని మాట మార్చారు. ఈ వ్యవహారం చూస్తుంటే ‘స్కిల్ కుంభకోణం’ గుర్తురావడం లేదూ? తొలుత సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆ కంపెనీ రంగంలోకి వచ్చి ఖండించిన తర్వాత కాదు కాదు, అందులో పనిచేసే ఉద్యోగితో ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చారు. అన్ని స్కామ్‌ల స్క్రిప్టూ ఒకే రకంగా ఉంటుందేమో?
‘పీపీపీ’కి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉండటానికి జగన్ కారణమని భావిస్తున్న కూటమి నేతలు ఆయనపై శివమెత్తి ఊగిపోయారు. ఇందులో డిప్యూటీ సీఎం, ఫోర్త్ టైమ్ సీఎం పోటీపడ్డారు. యెల్లో మీడియా పోషిస్తున్న పాత్రకు పరాకాష్ఠ ఇవాళ్టి ‘ఈనాడు’ సంపాదకీయం. ‘జగన్ విషరాజకీయాలు’ అనే శీర్షికతో కలంలో విషం పోసి దాన్ని కాలమ్ నిండా వెదజల్లారు. ఈ విషవాహినిలో కొన్ని అపురూప విషయాలను కూడా అది దొర్లించింది.
భిన్న పార్టీల సభ్యులతో కూడిన పార్లమెంట్ స్థాయీ సంఘం కూడా ‘పీపీపీ’ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్వహించుకోవాలని సూచించిందనీ, దాన్ని కూడా జగన్ చెవి కెక్కించుకోలేదనీ ‘ఈనాడు’ వాపోయింది. ప్రభుత్వ రంగంలో ప్రారంభమై కొంతమేరకు పూర్తయిన కాలేజీలను కూడా ‘పీపీపీ’కే అప్పగించాలని కూడా స్థాయి సంఘం చెప్పిందా? ఇక చేపట్టబోయే వాటి గురించి చెప్పిందా? ఏడాదిన్నర కాలంలో2 లక్షల 70 వేల కోట్లకు పైగా చేసిన అప్పులో ఓ నాలుగు వేల కోట్లు కేటాయిస్తే పది కాలేజీలు పూర్తయ్యే అవకాశం ఉన్నా కూడా ‘పీపీపీ’కే అప్పగించాలని స్థాయీ సంఘం చెప్పిందా?
అయినా దేశ వనరులన్నింటినీ ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం కంకణం కట్టుకున్న ఎన్టీఏ ప్రభుత్వహయాంలో ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ ఏ సలహా ఇచ్చినా వేదవాక్కు అవుతుందా? యుగాల నాటి ఆరావళి పర్వతశ్రేణి ఎత్తు కొలతల్ని నిర్ణయించి, వాటిని తవ్వి పోసుకోవడానికి అనుమతులకు సిద్ధమైన ఎన్డీఏ సర్కార్ ‘పీపీపీ’లకు అనుకూలం కాకపోతే వ్యతిరేకంగా ఉంటుందా? ఈ పద్ధతిలో చేపట్టే వైద్య కళాశాలలూ, ఆరోగ్య సేవల ప్రాజెక్టులకు మూలధన వ్యయంలో 30–40 శాతం, నిర్వహణ వ్యయంలో పాతిక శాతం గ్రాంటుగా ఇస్తా్తమని కేంద్రం రాసిందట! కొత్త కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉంటే ఈ గ్రాంటు ఇవ్వబోమని కూడా కేంద్రం రాసిందా? ఆ విషయం కూడా చెప్పాలి కదా!
జనం ఛీకొట్టి 11 సీట్లకే పరిమితం చేసినా జగన్ తనకు అలవాటైన బెదిరింపు భాషను మానుకోలేదట! అలా అని ‘ఛీనాడు’ చెబుతున్నది. నిజమే, 11 సీట్లకే వైసీపీ పరిమితమైందన్న మాట వాస్తవమే! 40 శాతం ఓట్లు వచ్చాయన్న మాట కూడా నిజమే కదా! పవన్ కల్యాణ్ పార్టీతోపాటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే తప్ప, ఈ కూటమికి కొన్ని ముదనష్టపు మీడియా సంస్థలు తోడైతే తప్ప టీడీపీ నిల బడలేకపోయిందన్న మాట కూడా నిజమే కదా!
పోలింగ్ సమయం ముగిసిన తర్వాత అసాధారణ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలింగ్ పన్నెండున్నర శాతం పెరగడం అనుమానాలు రేకెత్తిస్తున్నదని కొన్ని జాతీయ సంస్థలు లెక్కలతో సహా వెల్లడించిన విషయం కూడా వాస్తవమే కదా! ఇటువంటి విషయాలన్నీ మరుగునపెట్టి జగన్‌ను 11 సీట్లకే పరిమితం చేశామంటూ రొయ్య మీసాలు తిప్పడం, సంపాదకీయాల్లో రంకెలు వేయడం చోద్యంగా లేదా? రాజధానికి భూమినిచ్చిన రైతు రామారావు నిన్న జరిగిన గ్రామ సభలో తనకు జరిగిన మోసాన్ని చెబుతూ మంత్రి సాక్షిగా గుండె పగిలి చనిపోతే ఆ వార్త వేయాలనే
ఇంగితం లేని పత్రిక సుద్దులు చెబితే ఎట్లా?
జాతీయ ఆంగ్లపత్రిక ‘ది హిందూ’ ఎడిట్ పేజీలో కూడా ‘పీపీపీ’ల అంశంపై ఇవాళ ప్రధాన వ్యాసం అచ్చయింది. మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కూడా పనిచేసిన సుజాతారావు ఈ వ్యాసాన్ని రాశారు. ఆమె ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా చాలాకాలం పనిచేశారు. ‘పీపీపీ’ విధానం ద్వారా ఆరోగ్య సేవలను అందజేయాలనుకోవడం వాంఛ నీయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ షరతులను కచ్చితంగా అమలుచేసే యంత్రాంగం లేకుండా ప్రజారోగ్యం వంటి కీలక రంగాల్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం అవివేకమని ఆమె వ్యాఖ్యానించారు. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య సేవలను ముక్కల కింద విడగొట్టి అరడజన్ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిందనీ, వాటి అజమాయిషీ చేయలేకపోవడంతో ప్రజారోగ్య సేవలుగందరగోళంలో పడ్డ సంగతినీ సుజాతారావు గుర్తుచేశారు. 70 శాతం బెడ్ల కేటాయింపు, ఔట్ పేషెంట్ సేవలు ఉచితంగాఅందజేయడం వంటి నిబంధనలను అమలు చేయడం సాధ్యం కాదని ఆమె కుండబద్దలు కొట్టారు.
ఒక్క సుజాతారావే కాదు, ఎందరో విజ్ఞులు వైద్యరంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ‘పీపీపీ’ అంటే ప్రైవేటీకరణ కాదనే డొల్ల వాదనను ఖండిస్తున్నారు. ‘పీపీపీ’ మీద ఇటీవల ముఖ్యమంత్రి ఒక విచిత్ర వాదన ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ‘పీపీపీ పద్ధతిలో రోడ్లను అప్పగిస్తాం. వాళ్లు కొన్నాళ్లు వాటిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు. అంటే అవి ప్రభుత్వ ఆస్తిగానే ఉంటాయ’ని ఆయన చెప్పారు. కానీ దశా బ్దాల తరబడి కాంట్రాక్టర్లు ఆ రోడ్లను నిర్వహించినంత కాలం జనం టోల్ ఫీజు కట్టాలనే సంగతిని మాత్రం ఆయన చెప్పలేదు. ప్రభుత్వం ఇప్పటికే మెడికల్ కాలేజీల కోసం విలువైన భూముల్ని కేటాయించింది.
వివిధ దశల్లో నిర్మాణాలు కూడా పూర్తి చేసింది. ఇంకో 4,500 కోట్లు ఖర్చుపెడితే ఆ పది కాలేజీలు ప్రభుత్వపరమవుతాయి. ఈ దశలో వాటిని పలు రాయితీలతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, రెండేళ్లపాటు సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిబంధనలు రూపొందించి, ఇదే పెద్ద అభివృద్ధి మార్గంగా కూటమి ప్రచారం చేసుకుంటున్నది.
పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందకుండా, పేద విద్యార్థులకు వైద్యవిద్య అందకుండా చేసే ఈ విధానాన్ని జగన్ మోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇందులో ఇమిడి ఉన్న అవి నీతిని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టి, నిర్వహణ కోసం రాయితీలు ఇచ్చి, రెండేళ్లపాటు జీతాలు కూడా ఇచ్చే ఏర్పాటులో ఏ కుంభకోణం లేదని చెబితే ఎవరు నమ్ముతారు? జగన్ పిలుపుతో జనకోటి గళం కలపడంతో కూటమి నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. అందుకే జగన్ మీద దాడి చేస్తున్నారు.
ఈ దాడి కేవలం జగన్ మీదనే అనుకోవడానికి వీల్లేదు. ఇది ప్రజావైద్యం మీద దాడి! పేద ప్రజల ఉన్నత విద్యా ఆకాంక్షల మీద దాడి!! రాజ్యాంగ ఆశయాల మీద దాడి!! వారు చేసే విమర్శలకు ఏ రకమైన ఆధారాన్ని చూపెట్టరు. ఏ లెక్కల ప్రకారం చెబుతున్నారో చెప్పరు. పుర్రెకు తోచింది చెబుతారు. నోటికి వచ్చింది మాట్లాడతారు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ప్రగతిలో, వస్తూత్పత్తి రంగంలో జగన్ కాలంలో ఏపీ దక్షిణాది లోనే నంబర్ వన్‌గా ఉన్నదని రిజర్వ్ బ్యాంకు చెప్పినా ఈ కూటమి వినదు.
అన్ని రంగాల్లో ఏపీని జగన్ గాఢాంధకారంలోకి నెట్టారని సంపాదకీయంలో ‘ఈనాడు’ రాసింది. ఎవరు చెప్పారు? ‘కాగ్’ చెప్పిందా? ‘నీతి ఆయోగ్’ చెప్పిందా? జీఎస్టీ లెక్కలు చెప్పాయా? అటువంటి సంస్థల్ని ఉటంకిస్తే కూటమి లెక్కలు తారుమారవుతాయి. కనుక వాటి జోలికి పోరు. ప్రజా ధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి కుట్రలు చేస్తున్న విషరాజకీయం, దానికి తాబేదారుగా ‘ఈనాడు’ ఒలకబోస్తున్న విష సంపాదకీయం – వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యంపై ఇదొక ‘విషకీయ’క్రీడ!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


