గగన వీధుల్లో మన అంతరిక్ష శాస్త్రవేత్తలు మరో అపురూపమైన రికార్డు నమోదు చేసుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఇంతవరకూ ప్రయోగిస్తూ వస్తున్న రాకెట్లలో అరుదైనదిగా, ‘బాహుబలి’గా చెబుతున్న ఎల్‌వీఎం3–ఎం6 బుధవారం ఉదయం నిప్పులు చిమ్ముకుంటూ ఏకంగా 6,100 కిలోల బరువుండే బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకుపోయి నిర్దిష్ట కక్ష్యలో ఉంచింది. ఎల్‌వీఎం3–ఎం6 సాదాసీదా రాకెట్ కాదు. దాని బరువు 6,40,000 కిలోలు. ఎత్తు 43.5 మీటర్లు. మన గడ్డపైనుంచి ఇంతవరకూ ప్రయోగించిన ఉపగ్రహాల్లో బ్లూబర్డ్ బ్లాక్–2 అత్యంత భారీ ఉపగ్రహం. ఈ ప్రయోగంలో మరో రికార్డు కూడా ఉంది.
కేవలం 52 రోజుల వ్యవధిలో రెండు ఉపగ్రహాలను పంపటం ఇదే ప్రథమం. గత నెల 2న 4,400 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ఎల్‌వీఎం3–ఎం5 భూ అనువర్తిత బదిలీ కక్ష్య(జీటీఓ)లో ప్రవేశపెట్టింది. తాజాగా ఎల్‌వీఎం3–ఎం6 కేవలం 15 నిమిషాల్లో నిమ్న భూకక్ష్య (లియో)లో ... అంటే 518 కిలోమీటర్ల ఎత్తులో బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని ఉంచింది. ఎల్‌వీఎం3 రాకెట్ మన శాస్త్రవేత్తలకు విశ్వసనీయమైనది. ప్రయోగాత్మకంగా పంపిన తొలి రాకెట్‌తో మొదలుపెట్టి ఇంతవరకూ ఈ రకం రాకెట్ ద్వారా ఎనిమిది ప్రయోగాలు విజయవంతం కాగా, ఇప్పుడు తొమ్మిదో ప్రయోగం సైతం భేషుగ్గా ఉండటం మన శాస్త్రవేత్తల ఘనతకు తార్కాణం.
అంతరిక్షంలో సమర్థవంతమైన వాణిజ్య సేవలందించి దేశానికి కీర్తిప్రతిష్ఠలతోపాటు దండిగా ఆదాయాన్ని తెచ్చేవిధంగా ఇస్రో తనను తాను తీర్చిదిద్దుకుంది. ఈ రంగంలో ఎదురవుతున్న పోటీని అవలీలగా అధిగమించేలా మన శాస్త్రవేత్తలు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటున్నారు. వ్యయం అదుపు, లక్ష్యాన్ని సాధించగల నేర్పు ఇస్రో సొంతం. అందుకే 34 దేశాలు 434 ఉపగ్రహాలను ఇస్రో ద్వారా ప్రయోగించాయి.
ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు సంస్థలు సైతం ఉపగ్రహ ప్రయోగాల కోసం దాన్ని ఆశ్రయిస్తున్నాయి. విదేశీ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని ఉపగ్రహాలను ప్రయోగించటం కోసం ఇస్రో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) సంస్థను ఏర్పర్చింది. దానికింద ఇంతవరకూ రెండు ఉపగ్రహాలను పంపింది. ఆ వరసలో బ్లూబర్డ్ బ్లాక్–2 మరో కలికితురాయి. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్‌తో కుదిరిన ఒప్పందం పర్యవసానమే తాజా ప్రయోగం.
ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు దీటుగా సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతోంది. ఈ 5జీ యుగంలో పాత ఉపగ్రహాలు పెద్దగా ఉపయోగపడవు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లకు నేరుగా హైస్పీడ్ సెల్యులర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించటం వర్తమాన అవసరం. అందుకు బ్లూబర్డ్ బ్లాక్–2 సరిగ్గా తోడ్పడుతుంది. ఇప్పుడు ప్రయోగించిన ఉపగ్రహం ఇంతవరకూ అంతరిక్షం చేరుకున్న ఈ రకం ఉపగ్రహాల్లో మూడున్నర రెట్లు పెద్దది.
స్టార్‌లింక్, వన్‌వెబ్ వంటి ఉపగ్రహాలు సైతం మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నా వాటితో పోలిస్తే బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహం సాంకేతికంగా ఉన్నతమైనది. దీనికున్న ప్రత్యేక యాంటెన్నాలు టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో సైతం స్మార్ట్ ఫోన్లకు నేరుగా హైస్పీడ్ డేటాను అందించగలవు. అలాగే ఎదురుగా కూర్చున్న మరో వ్యక్తితో మాట్లాడుతున్నామనిపించే విధంగా అవతలి గొంతును స్పష్టంగా వినిపించగలవు. నాణ్యమైన వీడియో కాల్స్‌కు తోడ్పడగలవు. అయితే మన దేశం నుంచి దీన్ని ప్రయోగించారన్న మాటేగానీ... ఇది అందించే సేవలు మాత్రం ఇక్కడ అందుబాటులో ఉండవు. కారణం మన నిబంధనలు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అనుమతించవు.
అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అగ్ర రాజ్యాలు పోటీపడుతున్నాయి. ఏ ప్రయోగా లైనా ఐక్యరాజ్యసమితి చెప్పినట్టు శాంతియుత ప్రయోజనాలకు, మానవాళి మేలుకు తోడ్పడాలి. ఆ దిశగా మన ఇస్రో ఎన్నదగిన కృషి చేస్తోంది. ప్రయోగాల్లో వంద శాతం సక్సెస్ రేటు సాధించటం, సంక్లిష్ట ప్రయోగాలను సైతం సునాయాసంగా చేయగల నేర్పును సొంతం చేసుకోవటం ఇస్రో ప్రత్యేకత. ఇప్పుడు సాధించిన విజయం భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలకు బాటలు పరుస్తుందనటంలో సందేహం లేదు.


