అరుణ యానంలో ఆమె ప్రతిభ | Indian-Origin Scientist Vandi Verma Behind Mars Rover AI-Powered Drive | Sakshi
Sakshi News home page

అరుణ యానంలో ఆమె ప్రతిభ

Feb 7 2026 5:41 AM | Updated on Feb 7 2026 5:41 AM

Indian-Origin Scientist Vandi Verma Behind Mars Rover AI-Powered Drive

టెక్నో–ఉమెన్‌

ఏఐ సాంకేతికతను అంగారక గ్రహంపై కూడా అద్భుతంగా ఉపయోగించవచ్చునని నిరూపించింది నాసా వారి పర్సెవరెన్స్‌ రోవర్‌. మరొక గ్రహంపై ఏఐ– ఆధారిత అన్వేషణకు బలాన్ని చేకూర్చిన విజయం ఇది. ఈ విజయంలో భారత సంతతికి చెందిన అంతరిక్ష రోబోటిక్‌ నిపుణురాలు వంది వర్మ కీలక పాత్ర పోషించారు.

పుట్టినరోజు కానుకగా చిన్నప్పుడు వంది వర్మకు ఒక పుస్తకం వచ్చింది. సౌర వ్యవస్థపై రాసిన పుస్తకం అది. పుట్టినరోజు కానుకగా శాస్త్ర, సాంకేతికరంగ పుస్తకం అందుకున్న ఆ చిన్నారికి శాస్త్రరంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటానని, అంగారక గ్రహంపై రోవర్‌ను నడపడంలో కీలక పాత్ర పోషిస్తాన నీ అప్పుడు తెలియదు!

అలా రోబోలపై ఆసక్తి మొదలైంది...
వంది వర్మ జన్మస్థలం పంజాబ్‌లోని హల్వార. తండ్రి భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) లో పైలట్‌. చండీగఢ్‌లోని ‘పంజాబ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ’లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన వర్మ తరువాత పెన్సిల్వేనియాలోని కార్నెగి మెల్లన్‌ యూనివర్శిటీ (సిఎంయు)లో రోబోటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. ‘సిఎంయు’లో చదువుతున్న రోజుల్లో రోబోటిక్స్‌పై అమితమైన ఆసక్తి పెంచుకున్నారు.

‘ట్రాక్టబుల్‌ పార్టికల్‌ ఫిల్టర్స్‌ ఫర్‌ రోబోట్‌ ఫాల్ట్‌ డయాగ్నసిస్‌’ అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. చిట్టడవిలో నాసా ప్రయోగ బెలూన్‌లను సేకరించడానికి ఇతర రోబోట్‌లతో పోటీపడే సరికొత్త రోబోట్‌ను రూపొందించారు. దాని పనితీరు వర్మకు నచ్చింది. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆ రోబోట్‌ పనిచేసిన తీరు నన్ను అబ్బురపరిచింది’ అంటారు వర్మ. అప్పటినుంచి రోబోట్‌లపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.

ప్రయాణమే మన బలం
2007లో నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబోరేటరీ లో చేరిన వర్మ ప్రస్తుతం ‘మార్స్‌ మిషన్‌ రోబోటిక్స్‌ ఆపరేషన్స్‌’ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ‘అంతరిక్ష రహస్యాలను తెలుసుకోవడానికి రోబోటిక్‌ అన్వేషకుల అవసరం ఎంతో ఉంది. గ్రహాంతర వాతావరణంలో రోబోలు మాత్రమే కనుగొనగలిగే విషయాలు ఎన్నో ఉన్నాయి’ అంటారు వర్మ.
‘అంగారక గ్రహంపై ఒకప్పుడు ఏదో ఒక జీవి నివసించి ఉండవచ్చు అనే సందేహం నుంచి అసలు ఆ గ్రహంలో ఏం జరుగుతుంది? అనే ఆసక్తి వరకు తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఎన్నో కొత్త ప్రదేశాలకు వెళ్లాను. 

కొత్త వ్యక్తులతో మాట్లాడాను. తరచు ప్రయాణిస్తూ  ఉండడం వల్ల విభిన్న నేపథ్యాలు, విలువలు ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం వస్తుంది. దీంతో మనసు విశాలం అవుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటాం. అందుకే ప్రయాణం అనేది ముఖ్యం. ఇక అంగారక గ్రహం విషయానికి వస్తే...అక్కడ జీవం ఉనికిని మనం చూడలేదు. అయితే ప్రతి గ్రహానికి సంబంధించి భౌగోళిక శాస్త్రంలో కొన్ని గుర్తులు మిగిలే ఉన్నాయి. మనం చదవకుండా వదలేసిన కథలు అవి. ఇప్పుడు చదవాలి. రోబోల పాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది’ అంటారు వర్మ.

సవాలు విసిరే పర్యావరణంలో...
మానవులను పంపడం చాలా ప్రమాదకరమైన చోట రోబోలను పంపడమే సరిౖయెన పరిష్కారం అయినప్పటికీ, వాటిని నిర్మించడం, అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా చేయడం ఆషామాషీ విషయం కాదు. చిన్నపాటి తప్పు జరిగినా మిషన్‌ మొత్తానికీ ‘శుభం’ కార్డ్‌ పడుతుంది.
‘మార్స్‌ పర్యావరణం గురించి లోతుగా తెలియనప్పుడు రోబోల నిర్మాణం అనేది సవాలుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలోనే సంక్లిష్టమైన పనులు చేసే, అదే సమయంలో సురక్షితంగా ఉండగలిగే రోబోను తయారు చేయాలి’ అంటారు వర్మ.

భవిష్యత్‌ విజయానికి అద్దం పట్టేలా...
నాసా వారి పర్సెవరెన్స్‌ రోవర్‌ మానవ జోక్యం లేకుండా పూర్తిగా కృత్రిమ మేధస్సు(ఏఐ) ద్వారా ΄్లాన్‌ చేసిన మార్గాలలో అంగారక గ్రహంపై విజయవంతంగా డ్రైవ్‌లను పూర్తి చేసింది. రాళ్ళు, వాలులు, ఇసుక లక్షణాలను గుర్తించడానికి జనరేటివ్‌ ఏఐ వ్యవస్థలు ఆర్బిటల్‌ ఇమేజరీ, రోవర్‌ నావిగేట్‌ డేటాను విశ్లేషించాయి. వే  పాయింట్‌లతో నిరంతర డ్రైవింగ్‌ మార్గాన్ని ఏర్పర్చాయి. మామూలుగానైతే ఈ ప్రక్రియను మానవులు నిర్వహిస్తారు.

‘ఇది చెప్పుకోదగిన పురోగతి. ఏఐ సాంకేతికత ఆపరేటర్‌ల పనిభారాన్ని తగ్గిస్తుంది. నావిగేషన్‌కు సంబంధించిన ప్రధాన అంశాలను రోవర్‌ ఎలా క్రమబద్ధీకరించగలదో ఈ పరీక్ష నిరూపించింది. భవిష్యత్‌లో రోబోటిక్‌ మిషన్‌లను ఏఐ సాంకేతికతతో ఎలా నిర్వహిస్తాం అనేదానికి ఈ విజయం అద్దం పడుతుంది’ అంటారు వర్మ.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో... ఆ గ్రహంలోకి!
మిషన్‌ లైఫ్‌సైకిల్‌లో రోబోటిక్‌ ఇంజినీర్లు విభిన్న పాత్రలను పోషిస్తారు. మార్స్‌పై రోవర్స్‌ శక్తిసామర్థ్యాలకు సంబంధించిన కోడ్‌ను రాయడంతోపాటు ఇంకా ముఖ్యమైన పనులెన్నో చేశాను. రోవర్‌ను ఆపరేట్‌ చేయడంలో పాలుపంచుకున్నాను. మార్స్‌పై ఆపరేషన్‌లను హ్యాండిల్‌ చేయడం అనేది నాకు ఇష్టమైన పని. ఎప్పటి నుంచో అంగారక గ్రహంపై రోబోలను డ్రైవ్‌ చేస్తున్నాను. 

అంగారక గ్రహంపై ఆపరేషన్‌ల ద్వారా నేను ఎప్పటికప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను. మనం అనేక  రంగాలలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ని ఉపయోగించడం అనేది సాధారణం. ఆ  సాంకేతికతను మేము సంక్లిష్టమైన వాతావరణంలో ఉపయోగిస్తున్నాం. మార్స్‌పై ఏ రాయి ఆసక్తికరంగా ఉందో రోవర్‌ స్వయంచాలకంగా (ఆటోనమస్‌గా) గుర్తించడానికి మేము ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. వైడ్‌–యాంగిల్‌ ఇమేజ్‌లను తీసుకుంటున్నాం. ఆసక్తికరంగా ఉన్న వాటిని రోబోట్‌  తెలుసుకోవడంలో సహాయపడడానికి ఆఫ్‌లైన్‌ పద్ధతులను ఉపయోగిస్తున్నాం.

– వంది వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement