ప్రమాదవశాత్తు దిగినా ప్రాణాలతో బయటపడిన సిబ్బంది
ల్యాండింగ్ గేర్ లేకుండా నాసా విమానం ల్యాండింగ్
న్యూయార్క్: విమానం రన్‌వే మీద దిగేటప్పుడు ల్యాండింగ్ గేర్ సవ్యంగా తెరచుకుని టైర్ల మీదనే ల్యాండింగ్ అయ్యాక సైతం అగ్నిప్రమాదాల బారిన పడిన విమానాలు కోకొల్లలు. అలాంటిది టైర్లు బయటికి రాకుండానే నేరుగా విమానం బాడీ నేలను తాకినా విమానంలోని వారంతా క్షేమంగా ప్రాణాలతో బయటపడిన అద్భుత ఘటన అమెరికాలో జరిగింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వారి విమానం ప్రమాదానికి గురైనప్పుడు ఈ అరుదైన ఘటన సంభవించింది.
సంబంధిత వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సంబంధిత వివరాలను నాసా తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్‌కు ఆగ్నేయంగా ఉన్న ఎల్లింగ్టన్ విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా దిగింది. భూమి నుంచి గరిష్టంగా 63,000 అడుగుల ఎత్తులో ఆరున్నర గంటలపాటు ఏకధాటిగా ప్రయాణించగల డబ్ల్యూబీ57 రకం విమానాన్ని నాసా వినియోగిస్తోంది.
జియోఇంజనీరింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పరిశోధనల కోసం నాసా దీనిని ఉపయోగిస్తోంది. బుధవారం సైతం ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో హఠాత్తుగా సాంకేతికసమస్య ఎదురైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో సమీప ఎల్లింగ్టన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు ప్రయత్నించగా ల్యాండింగ్ గేర్ తెరచుకోకపోవడంతో టైర్లు లోపలివైపే ఉండిపోయాయి. అయినాసరే పైలట్ల ధైర్యంతో అలాగే విమానాన్ని కిందకు దింపారు. విమానం దిగువ బాడీ మొత్తం రన్‌వేను తాకుతూ అలాగే వందల మీటర్ల దూరం ముందుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగాయి. వెనువెంటనే ఎయిర్‌పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేసి లోపలి వాళ్లందర్నీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 60,000 అడుగుల ఎత్తులో జరిగే ప్రయోగాల కోసం ఉపయోగించే కీలక విమానం బుగ్గిపాలుకాకుండా పైలట్లు భలేగా రక్షించారని పలువురు పొగడ్తల్లో ముంచెత్తారు.


