అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో 27 ఏళ్లపాటు వ్యోమగామిగా సేవలందించి.. ఈ మధ్యే రిటైర్మెంట్ ప్రకటించారు సునీతా విలియమ్స్. భారత సంతతికి చెందిన ఈమె ఖాతాలో పలు రోదసీ యాత్ర రికార్డులు కూడా నమోదు అయ్యాయి. అయితే 608 రోజులు అంతరిక్షంలో గడిపిన ఆమె.. తన అనుభవాల్లో అత్యంత విచిత్రంగా కనిపించిన రెండు విషయాలను తాజాగా వెల్లడించారు.
రిటైర్‌మెంట్ తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చిన సునీతా విలియమ్స్.. యువ పారిశ్రామికవేత్త రాజ్ శామానీ నిర్వహించిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పలు అంతరిక్ష అనుభూతుల్ని కూడా పంచుకున్నారామె. ‘‘ఇప్పుడు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల సంఖ్య లెక్కలేనంతగా ఉంది. ముఖ్యంగా గత కొన్ని ఏళ్లలో.. కమ్యూనికేషన్ ఉపగ్రహాల సంఖ్య బాగా పెరిగింది. ఇది మంచిదే కావొచ్చు. కానీ, ఆ దృశ్యం చూశాక నా నోట మాట రాలేదు. అంతరిక్షం నుంచి చూస్తే అది కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తోంది. భూమి చుట్టూ చాలా వస్తువులేవో తిరుగుతున్నాయి అనే భావన కలిగింది..
ఆమె చూసిన మరో విచిత్ర దృశ్యం.. ట్రాన్సియంట్ ల్యూమినస్ ఈవెంట్స్ (TLEs). ఇవి మేఘాలపై ఏర్పడే అరుదైన ప్రకాశవంతమైన సంఘటనలు. బ్లూ జెట్స్ , రెడ్ స్ప్రైట్స్ అనే ఈ దృశ్యాలు.. ఉరుములు-మెరుపులు సంభవించే సమయంలో మేఘాలపై నుంచి వెలువడే శక్తి తరంగాల్లా కనిపిస్తాయి. భూమి నుంచి వీటిని చూడటం కష్టమైనప్పటికీ, అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి వీటిని స్పష్టంగా చిత్రీకరించగలిగారు.
సునీత టీంలోని డాన్ పెటిట్, మ్యాట్ డొమినిక్, అలాగే నికోల్ అయర్స్ వీటిని కెమెరాలో బంధించారట. ఆ దృశ్యాలు ఎంతో చూడముచ్చటగా అనిపించాయని అన్నారామె. మొత్తంగా.. అంతరిక్షంలో మనిషి ఎదుర్కొనే కొత్త వాస్తవాలు, ప్రకృతి అద్భుతాలను తాను చూశానని ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే.. మెక్సికో, అమెరికా ప్రాంతాలపై ప్రయాణిస్తున్నప్పుడు నికోల్ అయర్స్ ఈ స్ప్రైట్ ఫోటోలు తీయగా.. ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణగా మారాయి.
Just. Wow. As we went over Mexico and the U.S. this morning, I caught this sprite.
Sprites are TLEs or Transient Luminous Events, that happen above the clouds and are triggered by intense electrical activity in the thunderstorms below. We have a great view above the clouds, so… pic.twitter.com/dCqIrn3vrA— Nichole “Vapor” Ayers (@Astro_Ayers) July 3, 2025


