
న్యూఢిల్లీ: రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలపడంపై గవర్నర్లకు, తనకు గడువు నిర్దేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరిన అంశంపై గురువారం సైతం రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానుద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ సేథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌ల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై వాదనలను ఆలకిస్తూ ఈ వ్యాఖ్యలుచేసింది.
‘‘రాజ్యాంగబద్ద సంస్థలు తమ విధులను నిర్వర్తించకుండా నిర్లక్ష్యవహించినా, రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా గవర్నర్ నిష్క్రియాపరత్వం చూపినా సరే తాము చేతులు కట్టుకుని కూర్చోవాలా?’’ అని కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సూటిగా ప్రశ్నించింది. దీనిపై మెహతా బదులిచ్చారు. ‘‘అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులపై ఎటూ తేల్చకుండా గవర్నర్ వాటిని అలాగే తనవద్దే అట్టిపెట్టుకుంటే అలాంటి సందర్భాల్లో రాష్ట్రాలే రాజకీయ పరిష్కారాలను వెతకాలి. అంతేగానీ న్యాయస్థానాల నుంచి పరిష్కారాలను ఆశించకూడదు.
సమస్య పరిష్కారానికి సంప్రతింపుల మార్గంలో వెళ్లాలి. చర్చలకే తొలి ప్రాధాన్యత దక్కాలి’’ అని అన్నారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ జోక్యంచేసుకున్నారు. ‘‘ మీరన్నట్లు చర్చలకు సిద్ధపడకుండా ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం మా వద్దకొస్తే మేమేం చేయాలి?’’ అని ప్రశ్నించారు. దీనికి బదులుగా మెహతా.. ‘‘ ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కోర్టులను ఆశ్రయిస్తారని నేను అనుకోవట్లేను. సీఎం తొలుత ఆ గవర్నర్‌తో భేటీ కావాలి. అప్పుడా గవర్నర్ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి వారి సలహాలు, సూచనలతో పరిష్కారాలు వెతుకుతారు.
కొన్ని సార్లు టెలిఫోన్ సంభాషణలు కూడా సమస్యలను సద్దుమణిగేలా చేశాయి’’ అని అన్నారు. ‘‘ సమస్యల పరిష్కారానికి కొన్ని దశాబ్దాలుగా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఇది కూడా సాధ్యంకాకపోతే తొలుత ప్రతినిధి బృందం రంగంలోకి దిగి గవర్నర్, రాష్ట్రపతితో చర్చలు జరుపుతుంది. కొన్ని సార్లు మధ్యవర్తిత్వం కూడా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ మధ్య సఖ్యత కోసం రాజనీతిజ్ఞత అనేది బాగా అక్కరకొస్తుంది’’ అని మెహతా వాదించారు.
దీనిపై సీజేఐ గవాయ్ స్పందించారు. ‘‘ ఈ ప్రక్రియలో ఏదైనా తప్పు జరిగితే ప్రత్యామ్నాయంఉండాలి కదా. రాజ్యాంగానికి పరిరక్షకులుగా కోర్టులున్నాయి. అందుకే ఇలాంటి ప్రత్యామ్నాయాన్ని సైతం రాజ్యాంగానికి ఆపాదించేలా ఉండాలి’’ అని ఆయన అన్నారు. దీనిపై మెహతా మాట్లాడారు. ‘‘ ఏదైనా అంశాన్ని మనకు అనుగుణంగా ఆపాదించుకోవడం వేరు. రాజ్యాంగానికి సరిపోయేలా చూడడం వేరు. రాజ్యాంగబద్ధ సంస్థలతో ఏదైనా అంశాన్ని పరిష్కరించుకోవాలన్న సందర్భాల్లో కొంత వెసులుబాట్లు కల్పించాలి’’ అని అన్నారు.