ఇండియాకు వ‌చ్చి ఇదేం ప‌ని? | Taslima Nasreen slammed Afghan Foreign Minister | Sakshi
Sakshi News home page

అఫ్గాన్ విదేశీ మంత్రిపై తస్లీమా ఫైర్‌

Oct 11 2025 7:08 PM | Updated on Oct 11 2025 7:29 PM

Taslima Nasreen slammed Afghan Foreign Minister

అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో శుక్రవారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశానికి మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌ను అనుమతించకపోవడంపై దుమారం రేగింది. భార‌త్ ఉన్నా తాలిబాన్లు లింగ వివ‌క్ష చూపిస్తున్నారంటూ ప‌లు వ‌ర్గాలు ఫైర్ అయ్యాయి. తాజాగా బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ (Taslima Nasreen) కూడా స్పందించారు. మ‌హిళ‌ల‌ను మ‌నుషులుగానే తాలిబాన్లు చూడ‌డం లేదంటూ ఎక్స్ వేదికగా మండిప‌డ్డారు. లింగ వివ‌క్ష పాటించిన మీడియా స‌మావేశాన్ని ఎందుకు బ‌హిష్క‌రించ‌లేద‌ని పురుష జ‌ర్న‌లిస్టుల‌ను ప్ర‌శ్నంచారు.

''అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారతదేశానికి వచ్చి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశానికి మహిళా జర్నలిస్టులను ఆయ‌న అనుమ‌తించ‌లేదు. తాలిబన్లు ఆచరించే ఇస్లాంలో.. మహిళలు ఇంట్లోనే ఉండి పిల్లలను కనాలని, వారి భర్తలు, పిల్లలకు సేవ చేయాలని మాత్రమే భావిస్తున్నారు.

పాఠ‌శాల‌లు, ప‌ని ప్ర‌దేశాల్లోనే కాదు.. ఇంటి వెలుపల ఎక్క‌డా కూడా మ‌హిళ‌ల‌ను చూడటానికి ఈ స్త్రీ ద్వేషపూరిత పురుషులు ఇష్టపడరు. మ‌హిళ‌ల‌ను అస‌లు మ‌నుషులుగానే ప‌రిగ‌ణించరు. అందుకే స్త్రీల‌కు మానవ హక్కులు ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు. పురుష జర్నలిస్టులకు ఏదైనా మనస్సాక్షి ఉంటే, వారు విలేకరుల సమావేశం నుండి వాకౌట్ చేసి ఉండేవారు. నీచమైన స్త్రీ ద్వేషంపై నిర్మించిన దేశం అనాగరిక రాజ్యం. ఏ నాగరిక దేశం కూడా దాన్ని గుర్తించకూడద''ని తస్లీమా నస్రీన్ 'ఎక్స్‌'లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాజకీయ దుమారం
ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పైర్ అయ్యారు. భార‌త మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌కు జ‌రిగిన అవ‌మానంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించాల‌ని డిమాండ్ చేశారు. మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌ను తాలిబాన్లు మీడియా సమావేశానికి అనుమ‌తించ‌క‌పోవ‌డంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి. చిదంబ‌రం దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌కు మ‌ద్ద‌తుగా పురుష మీడియా ప్ర‌తినిధులు ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేయాల్సింద‌న్నారు.

మ‌రోవైపు ఈ వ్యవ‌హారంపై విదేశాంగ శాఖ వివ‌ర‌ణ‌యిచ్చింది. అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మాదేశంతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తెలిపింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement