
ప్రధాని నరేంద్ర మోదీని మెగా హీరో రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఆయనతో శనివారం భేటీ అయ్యారు. రీసెంట్‌గా ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. సదరు లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోదీని కలిసినట్లు చరణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
'మన ప్రధానమంత్రిని కలవడం ఎంతో గౌరవంగా అనిపించింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వెనుకున్న విజన్‌ని పంచుకోవడం గర్వంగా ఉంది. విలువిద్య మన సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగం. ఏపీఎల్ ద్వారా దీన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలన్నది మా ఆశయం. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది, ఈ వేదిక వాళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుంది' అని చరణ్ చెప్పుకొచ్చాడు.
మన దేశంలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ తదితర గేమ్స్‌కి లీగ్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలిసారి ఆర్చరీ(విలువిద్య) లీగ్ పోటీలు నిర్వహించారు. మొత్తంగా ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీ పడ్డాయి.
చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'తో వచ్చాడు. కానీ ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవుతోంది. వేసవికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

