టైటిల్: ‘మన శంకరవరప్రసాద్ గారు’.
నటీనటులు: చిరంజీవి, వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడ్కేర్, రఘుబాబు, అభినవ్ గోమఠం తదితరులు
నిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
విడుదల తేది: జనవరి 12, 2026
ఈ సంక్రాంతికి బరిలోకి దిగిన రెండో పుంజు ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘భోళా శంకర్’ లాంటి డిజాస్టర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని చిరంజీవి ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? చిరు ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. (Mana Shankara Vara Prasad Garu Movie Review)
కథేంటంటే..
శంకరవరప్రసాద్(చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన టీమ్(కేథరీన్, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం) కేంద్ర హోంమంత్రి నితీష్ శర్మ(శరత్ సక్సేనా) రక్షణ బాధ్యలతను చూస్తుంటుంది. వృత్తిపట్ల ఎంతో నిబద్ధతతో ఉంటే శంకరవరప్రసాద్.. పర్సనల్ లైఫ్‌ని లీడ్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య శశిరేఖ(నయనతార) అతనికి విడాకులు ఇచ్చి.. బడా వ్యాపారవేత్త అయిన తన తండ్రి జీవీఆర్(సచిన్ ఖేడ్కెర్) దగ్గరకు వెళ్తుంది. పిల్లలను కూడా చూపించపోవడంతో ఆరేళ్లుగా వరప్రసాద్ అదే బాధలో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నితీష్..తనకున్న పలుబడితో బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న తన పిల్లలకు పీఈటీ టీచర్‌గా వరప్రసాద్‌ని పంపిస్తాడు. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు వరప్రసాద్ ఎలా దగ్గరయ్యాడు? అసలు శశిరేఖ, వరప్రసాద్ విడిపోవడానికి గల కారణం ఏంటి? మైనింగ్ వ్యాపారవేత్త వెంకిగౌడ(వెంకటేశ్) కు శశిరేఖతో మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు శనిరేఖ, వరప్రసాద్ మళ్లీ కలిశారా లేదా?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
అనిల్ రావిపూడి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. ఆయన సినిమాకెళ్లి కొత్తదనం,ట్విస్టులు, లాజిక్కుల గురించి వెతకడం అంటే.. ప్యూర్ వెజ్ రెస్టారెంట్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినట్టే ఉంటుంది. పాత కథతోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కు రప్పించడం ఆయన స్టైల్. కథ-కథనం కంటే.. హీరోకి ఉన్న ప్లస్ పాయింట్స్‌ని ఎలా వాడుకోవాలనేదానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతాడు. హీరోని ఎలా చూపిస్తే..ఆడియన్స్ కనెక్ట్ అవుతారు? ఎక్కడ ఏ సీన్ పెడితే నవ్వుకుంటారు? అనేది అనిల్‌కి బాగా తెలుసు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికీ ఇదే మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి కూడా అనిల్ ఆ పనే చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్‌ని గట్టిగా వాడుకొని.. ఫ్యాన్స్ ఆయన్ని తెరపై ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలా చూపించాడు. అలా అని చిరులో ఉన్న మాస్ యాంగిల్‌ని పక్కన పెట్టలేదు. మధ్య మధ్యలో యాక్షన్ సీన్లను పెట్టి మాస్ లుక్‌ని కూడా చూపించాడు.
అయితే ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే లేదు. కోపంలో విడాకులు తీసుకున్న భార్యను పొందేందకు భర్త చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. అయితే ఇక్కడ అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటంటే.. ఈ సింపుల్ లైన్‌కి చిరంజీవి మేనరిజాన్ని హైలెట్ చేసేలా సన్నివేశాలు అల్లుకోవడమే. ఈ మధ్య కాలంలో...ఇంకా చెప్పాలంటే రీఎంట్రీ తర్వాత చిరంజీవిని తెరపై ఇంత స్టైలీష్‌గా, ఇంత హుషారుగా ఎవరూ చూపించలేదు. ఈ రకంగా చూస్తే చిరంజీవి ఫ్యాన్స్‌కి ఇది స్పెషల్ చిత్రమే. అయితే కథగా చూస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్థాయికి సరిపోలేదనే చెప్పాలి. ఒకనొక దశలో చిరంజీవిని చిన్న కమెడియన్‌లా చూపించారనే ఫీలింగ్ కలుగుతుంది.
ఓ రౌడీ ముఠా.. హోం మంత్రికి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. చిరు ఎంట్రీ సీన్‌తోనే అనిల్ రావిపూడి తరహా కామెడీ ప్రారంభం అవుతుంది. హుక్ స్టెప్ సాంగ్ వరకు కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇక వరప్రసాద్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. వరప్రసాద్-శశిరేఖల ప్రేమ..పెళ్లి.. విడాకులకు దారీతీసిన సంఘటనలు అన్నీ నవ్వులు పూయిస్తాయి.
స్కూల్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కథనం కాస్త బోరింగ్ సాగుతుంది. అయితే బుల్లిరాజా(రేవంత్) ఎంట్రీతో మళ్లీ నవ్వులు మొదలవుతాయి. ఇలా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ప్రతి పది నిమిషాలకు ఒక కామెడీ సీన్‌ని పెట్టి.. ఫస్టాఫ్ ముగించాడు. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. వీరేంద్ర పాండే పాత్ర ఎంట్రీతో మళ్లీ కథనం పుంజుకుంటుంది. కథతో సంబంధం లేకున్నా.. విడాకుల అంశంపై హీరో పాత్రతో ఓ మంచి సందేశం ఇప్పించాడు. అది కూడా కామెడీగానే చూపించినా.. సినిమా చూసిన ప్రేక్షకుడు కాస్త ఆలోచిస్తాడు. ఇక వెంకటేశ్ పాత్ర ఎంట్రీతో మళ్లీ నవ్వులు స్టార్ట్ అవుతాయి.
వెంకీ గౌడ్‌గా వెంకటేశ్ ఎంట్రీ నుంచి కథనం పరుగులు పెడుతుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. సాధారణ సమయంలో రిలీజ్ అయితే ఫలితం ఎలా ఉండేదో తెలియదు కానీ.. సంక్రాంతి పండక్కి వచ్చి ‘మన శంకరవరప్రసాద్ ’ మంచి పనే చేశాడు. ముందుగా చెప్పినట్లుగా కొత్తదనం ఆశించకుండా, లాజిక్కులు వెతక్కుండా హాయిగా నవ్వుకోవడానికి అయితే ఈ సినిమా చూడొచ్చు. (Positives And Negatives Of Mana Shankara Vara Prasad Garu Movie)
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం మెగాస్టార్ చిరంజీవినే. ఆయన లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్, డైలాగులు.. ఇవన్నీ చూస్తే.. ఒకప్పటి మెగాస్టార్ మన కళ్లముందు కనిపిస్తాడు. ఒకవైపు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటూనే.. యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హుక్ స్టెప్ పాటకు ఆయన వేసిన స్టెప్పులకు థియేటర్స్‌లో విజిల్స్ వేయడం గ్యారెంటీ. ఇక శశిరేఖగా నయన తార తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. హీరో మామగారిగా సచిన్ ఖేడ్కర్ చక్కగా నటించాడు. వెంకీ గౌడ పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయాడు.
చిరు-వెంకీ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటాయి. హీరో తల్లిగా జరీనా వహాబ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. నయనతారతో ఆమె చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. వరప్రసాద్ టీమ్ సభ్యులుగా నటించిన కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠంతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. భీమ్స్ సంగీతం సినిమాకు మరో ప్రధానబలం. మీసాల పిల్ల, హుక్ స్టెప్ సాంగ్‌తో తెరపై మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


