న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ మెట్రో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో సోమవారం ఉదయం కలకలం చోటుచేసుకుంది. ధౌలా కువాన్- శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ల మధ్య గుర్తుతెలియని దుండగులు సుమారు 800 మీటర్ల పొడవైన సిగ్నలింగ్ కేబుళ్లను దొంగిలించడానికి యత్నించారు. ఈ క్రమంలో కేబుళ్లను కత్తిరించి, ధ్వంసం చేయడంతో మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దెబ్బతిన్న సిగ్నలింగ్ వ్యవస్థ
మెట్రో పిల్లర్ నంబర్-09 సమీపంలో ఈ కత్తిరించిన కేబుల్ ముక్కలను డిఎంఆర్‌సి సిబ్బంది తమ తనిఖీల్లో గుర్తించారు. సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో, భద్రతా కారణాల దృష్ట్యా రైళ్ల వేగాన్ని భారీగా తగ్గించాల్సి వచ్చింది. సాధారణంగా అత్యంత వేగంతో దూసుకెళ్లే ఎయిర్‌పోర్ట్ లైన్ రైళ్లు, ఈ కేబుల్ నష్టం కారణంగా ధౌలా కువాన్ నుండి శివాజీ స్టేడియం (న్యూఢిల్లీ వైపు వెళ్లే లైన్) మధ్య కేవలం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడిచాయి.
అనౌన్స్‌మెంట్ల ద్వారా అప్రమత్తం
ఫలితంగా ప్రయాణ సమయం పెరిగి, విమానాశ్రయానికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, మిగిలిన కారిడార్‌లో సేవలు యథాతథంగా ఉన్నాయని, కేవలం ప్రభావిత ప్రాంతంలోనే నియంత్రణలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై సిబ్బంది స్టేషన్లలో, రైళ్లలో అనౌన్స్‌మెంట్ల ద్వారా ప్రయాణికులను ముందుగానే అప్రమత్తం చేశారు. పగటిపూట రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల కేబుల్ మరమ్మతు పనులను తక్షణమే చేపట్టడం సాధ్యం కాలేదని డిఎంఆర్‌సి తెలిపింది. ప్రతి 10 నిమిషాలకు ఒక రైలు నడిచే ఈ రద్దీ కారిడార్‌లో మరింతగా ఇబ్బందులు తలెత్తకుండా డిఎంఆర్‌సి వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
INCIDENT REPORT
New Delhi, dt: 11.01.2026
Train services on the Airport Express Line from Yashobhoomi Dwarka Sector-25 to New Delhi are being regulated since this morning due to theft and damage to approximately 800 metres of Signalling cables caused by miscreants in the… pic.twitter.com/Lt21euDMDf— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) January 11, 2026
తిరిగి పట్టాలెక్కిన మెట్రో
తాజా సమాచారం ప్రకారం ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో పనులు పూర్తయి, సేవలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి డిఎంఆర్‌సి విచారం వ్యక్తం చేస్తూ, ఈ తరహా కేబుల్ చోరీలతో మౌలిక సదుపాయాలకు నష్టం కలగడమే కాకుండా ప్రయాణికుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం, శాంతిభద్రతల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది.
ఇది కూడా చదవండి: భారత్ చేరుకున్న జర్మనీ చాన్స్‌లర్.. ప్రధాని మోదీతో భేటీ


