వాషింగ్టన్: అమెరికాలోని మైన్ (Maine) ప్రాంతంలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఒక చిన్న ప్రయాణికుల విమానం రన్‌వేపై క్రాష్ అయి.. ఒక్కసారిగా బోల్తా పడింది. అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, రన్‌వేను పూర్తిగా మూసివేశారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విషయంలో తెలియగానే ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానాశ్రయం వైపు ఎవరూ రావద్దని అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రజలను కోరారు.
ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ‘ఫ్లైట్ రాడార్ 24’ అందించిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన విమానం బాంబార్డియర్ ఛాలెంజర్ 600 రకానికి చెందినది. ఈ ప్రైవేట్ జెట్ హ్యూస్టన్ నుండి బాంగోర్ విమానాశ్రయానికి చేరుకుందని, తిరిగి టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని ఏడీఎస్-బి సిగ్నల్ డేటా ద్వారా తెలుస్తోంది. ఈ విమానం హ్యూస్టన్‌కు చెందిన ఒక కంపెనీ పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్లు ఫెడరల్ రికార్డులు తెలియజేస్తున్నాయి.ఈ ప్రైవేట్ జెట్‌లో ఎనిమిది మంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని సీఎన్‌ఎన్ తెలిపింది.
ప్రమాదం జరిగిన వెంటనే బాంగోర్, గ్లెన్‌బర్న్, హెర్మోన్ ప్రాంతాల నుండి అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు ఎయిర్‌ఫీల్డ్‌కు చేరుకున్నాయి. సహాయక బృందాలు వెళ్లేసరికి విమానం తలకిందులై ఉండగా, ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వస్తున్నట్లు స్థానిక టీవీ ఛానెల్స్ దృశ్యాలను ప్రసారం చేశాయి. ప్రమాద సమయంలో అక్కడ దట్టమైన మంచు కురుస్తుండటం, విపరీతమైన చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయితే ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమా అనేది ఇంకా తెలియరాలేదు.
విమానాశ్రయ అధికారులు రాత్రి 8:25 గంటలకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ప్రమాదం జరిగిన విషయాన్ని ధృవీకరించారు. విమానంలో ఎంత మంది ఉన్నారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదని, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రన్‌వేపై ఆపరేషన్స్ నిలిపివేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.
🚨A Bombardier Challenger 650 was involved in an incident at Bangor International Airport in Maine.
Our ADS-B data shows the aircraft had arrived from Houston and was attempting to depart at the time of the crash.
Eight people were on board. The aircraft is registered as N10KJ… pic.twitter.com/xUOcNg5Kmf— AirNav Radar (@AirNavRadar) January 26, 2026


