
పాట్నా: మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఎంఐఎం).. ‘ఇంతింతై.. వటుడింతై.. బ్రహ్మాండాంతపు సంవర్ధియై..’’ అన్నట్లుగా 1969లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(బల్దియా) ఎన్నికల్లో పత్తర్‌గట్టీ డివిజన్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి విజయదుందుభీ మోగించిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ క్రమంగా హైదరాబాద్ పాతనగరంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాగా వేసింది. తొలినాళ్లలో సలావుద్దీన్, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. క్రమంగా పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించి, జాతీయ స్థాయికి ఎదిగేలా చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఏఐఎంఐఎం)గా పార్టీని అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో పాగా వేశారు. గత ఎన్నికల్లో బిహార్‌లో ఐదు స్థానాలను గెలుచుకున్నారు. బిహార్ తాజా ఎన్నికల్లో 100 స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు మజ్లిస్ నేతలు.
గత ఎన్నికల్లో..
నిజానికి 2015 నుంచే బిహార్‌పై మజ్లిస్ వ్యూహరచనను ప్రారంభించింది. అప్పట్లో ఆశాజనకంగా ఓటు బ్యాంకును సాధించినా.. అసెంబ్లీలో పాగా వేయలేకపోయింది. 2020 ఎన్నికల్లో మాత్రం తన సత్తాను చాటుకుంది. సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. అమౌర్ నుంచి ఇమాన్, బైసీ నుంచి రుక్ముద్దీన్ అహ్మద్, కొచ్దమాన్ నుంచి ఇజ్హార్ ఆసిఫీ, బహదూర్ గంజ్ నుంచి అంజార్ నయీమీ, జోకిహాట్ నుంచి షానవాజ్ ఆలం విజయం సాధించి, అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
నాలుగో బలమైన శక్తిగా..
బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి బరిలో ఉండగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు మజ్లిస్ బలమైన ప్రత్యర్థిగా ముందుకు సాగుతోంది. తాజాగా శనివారం హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాము 243 సీట్లకు గాను.. 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మజ్లిస్ ఐదు రెట్లు అధిక స్థానాల్లో పోటీ చేయనుంది. ‘‘నిజానికి నేను ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌తోపాటు.. తేజస్వీ యాదవ్‌ను సంప్రదించాను. పొత్తు కోసం కృషి చేశాను. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే.. ఒంటరిపోరుకు సిద్ధమయ్యాం. భావసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకొని పోతాం. దీని ద్వారా బిహార్‌లో తృతీయ ఫ్రంట్‌కు అవకాశాలుంటాయి’’ అని మజ్లిస్ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మీడియాకు చెప్పారు.
ఓట్లు చీలుతాయా?
మజ్లిస్ పోటీతో సెక్యూలర్ ఓట్లు, ముస్లిం మైనారిటీల ఓట్లు చీలి.. ప్రధాన పార్టీలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలున్నాయి. 2020లో కూడా మజ్లిస్ ఈ అపవాదును మూటకట్టుకుంది. 2020లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఐదు స్థానాల్లో పాగా వేసింది. పలు స్థానాల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ ఫ్రంట్‌ను దారుణంగా దెబ్బకొట్టింది. అయితే.. 2022లో నలుగురు ఎమ్మెల్యేలు మజ్లిన్‌ను వీడి.. ఆర్జేడీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మాత్రమే మజ్లిస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2022 పార్టీ ఫిరాయింపుల తర్వాత మజ్లిస్ ఓటు బ్యాంకును పెంచుకోవడంపైనే దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17శాతానికి పైగా ఉన్న మైనారిటీల తరఫున అసెంబ్లీలో గళం వినిపించేది తామేనని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ముందుకు సాగాలని మజ్లిస్ అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ అసదుద్దీన్ ఒవైసీ గత నెల నాలుగు రోజులు బిహార్‌లో పర్యటించారు. సీమాంచల్‌పై దృష్టిపెడుతూ.. కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. ముస్లిం సమాజాన్ని ఈ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శలు చేశారు.
విమర్శలు మొదలు..
మజ్లిస్‌పై ప్రధాన పార్టీలు ఇప్పటికే విమర్శలు మొదలు పెట్టాయి. బీజేపీకి మజ్లిస్ బీ-టీమ్ అని ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్-ఆర్జేడీ ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు కలిగించడమే ఆ పార్టీ ధ్యేయమంటూ మండిపడుతున్నాయి. సెక్యూలర్ ఓట్లను విభజించి, బీజేపీకి లబ్ధి కలిగేలా చేయడమే మజ్లిస్ వ్యూహమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా.. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇంటింటి ప్రచారం అనేది మజ్లిస్ వ్యూహాల్లో ప్రధానాంశం.