
విష్ణుమూర్తిపై నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు
సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ వివరణ
న్యూఢిల్లీ: తాను అన్ని మతాలనూ గౌరవిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టంచేశారు. విష్ణుమూర్తిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఆయన గురువారం స్పందించారు. ఆరోపణలను ఖండించారు. తన వ్యాఖ్య లను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు.
మధ్యప్రదేశ్‌లో యునె స్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఖజు రహో ఆలయ ప్రాంగణంలో ఉన్న జవేరీ టెంపుల్‌లో భగవాన్ విష్ణుమూర్తి వి గ్రహం దెబ్బతిన్నదని, ఆలయాన్ని పునర్ నిర్మించి, అక్కడ మరో విగ్రహాన్ని ఏర్పా టు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాకేశ్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్‌తోపాటు జస్టిస్ కె.వినో ద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 16న విచారణ చేపట్టింది.
పిటిషన్‌ను తిరస్కరించింది. అది ప్రచార ప్రయోజన వ్యాజ్యం అంటూ ఆక్షేపించింది. విగ్రహం విషయంలో మీరు ఆరాధిస్తున్న విష్ణుమూర్తినే ఏదో ఒకటి చేయమని అడగండి అంటూ పిటిషనర్‌కు జస్టిస్ గవాయ్ సూచించారు. అలా చేస్తే మీరు నిజమైన విష్ణు భక్తులవుతారు అని చెప్పారు. దేవుడిని ప్రార్థించి, తర్వాత యోగా చేయండి అని పేర్కొన్నారు. శివుడికి మీరు వ్యతిరేకం కాకపోతే అక్కడే ఖజురహోలో పెద్ద శివలింగం ఉంది, దాన్ని పూజించండి అని జస్టిస్ గవాయ్ చెప్పారు.
విష్ణుమూర్తి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో జనం తప్పుపట్టారు. జస్టిస్ గవాయ్‌కి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అండగా నిలిచారు. జస్టిస్ గవాయ్ తనకు చాలా ఏళ్లుగా తెలుసని, ఆయన అన్ని మతాల ఆధ్యాత్మిక, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తుంటారని చెప్పారు. అన్ని మతాలను సమానంగా భావిస్తుంటారని తెలిపారు.
భగవంతుడిని కించపర్చడం ఆయన ఉద్దేశం కాదని అన్నారు. న్యూటన్ నియమం ప్రకారం ఒక చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుందని వివరించారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో ఒక చర్యకు తప్పుడు అతి ప్రతిస్పందన ఉంటుందని పేర్కొన్నారు. జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలను వక్రీకరించడం దురదృష్టకరమని స్పష్టంచేశారు. సోషల్ మీడియా పోస్టులను జస్టిస్ వినోద్ చంద్రన్ ఖండించారు. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా మారిందని విమర్శించారు.