ప్రపంచంలో శక్తివంతమైన నేతల్లో వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఆయన అలవాట్లు.. మేనరిజం.. ప్రోటోకాల్.. అన్నీ ఎంతో ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటిది ఆయన సమక్షంలో ఓ యువకుడు.. తన ప్రియురాలికి ప్రపోజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఆ ప్రపోజల్‌కు ఆ యువతి ఏం చేసింది.. దానికి పుతిన్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా?..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 ఏడాది ముగింపు నేపథ్యంతో.. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిపోర్టర్‌లు పలు ప్రశ్నలు అడగ్గా.. దానికి పుతిన్ బదులిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కిరిల్ బజానోవ్ అనే 23 ఏళ్ల యువ జర్నలిస్టు వంతు వచ్చింది. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని ప్లకార్డును పట్టుకున్న అతను.. పుతిన్ ముందే తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ‘నా స్నేహితురాలు దీన్ని చూస్తోంది. ఓల్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో.. నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా’ అని అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. వెంటనే ఆ ప్రాంగణంలోని వారంతా చప్పట్లు కొట్టారు.
‘Vladimir Vladimirovich, Breaking News’ — host interrupted Putin
‘She said yes’ — Kirill Bazhenov’s girlfriend accepted the proposal
Previously journalist proposed in the middle of the live Q&A pic.twitter.com/WI1PMftowG— RT (@RT_com) December 19, 2025
అనంతరం అతడు.. రష్యాలో జీవన వ్యయం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశాడు. తాను, తన స్నేహితురాలు ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని అయితే, విస్తృత ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు పుతిన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇక, సమావేశం కొనసాగుతుండగా.. ప్రోగ్రామ్ హోస్ట్ కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టు కిరిల్ బజానోవ్ ప్రపోజల్‌ను అతడి స్నేహితురాలు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో పుతిన్‌తో సహా అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తంచేస్తూ చప్పట్లు కొట్టారు.
అయితే కిరిల్ లాంటి యువ కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్.. విరాళాల రూపంలో అయినా ఇలాంటి పెళ్లిళ్లకు సాయం అందించాలని పిలుపు ఇచ్చారు. ఈ సమయంలో తమ పెళ్లికి రావాలంటూ కిరిల్ రష్యా అధినేతను ఆహ్వానించగా.. ఆయన నుంచి ఎలాంటి బదులు రాలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.


