అందుకేనేమో ఈ వరదలు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు | Supreme Court Slams Illegal Logging Amid North India Floods | Viral Real Pushpa Scene Video Cited | Sakshi
Sakshi News home page

అందుకేనేమో ఈ వరదలు.. ‘పుష్ప సీన్‌’పై చీఫ్‌ జస్టిస్‌ కీలక వ్యాఖ్యలు

Sep 4 2025 1:02 PM | Updated on Sep 4 2025 1:09 PM

Supreme Court Key Comments On North India Floods Details

పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలపై దేశసర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అడవుల్ని అక్రమంగా నరకడం వల్లే ఈ పరిస్థితి దాపురించి ఉండొచ్చని పేర్కొంటూ.. కేంద్రానికి, వరద ప్రభావిత రాష్ట్రాలకూ నోటీసులు జారీ చేసింది. 

ఉత్తరాది వరదలపై సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ పిల్‌ను గురువారం విచారించిన సీజేఐ బెంచ్‌.. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. అదే సమయంలో మీడియా కథనాలను పరిశీలిస్తే.. ఈ విపత్తులకు అక్రమంగా చెట్లు కొట్టేయడమే కారణమని స్పష్టమైన ఆధారాలతో తెలుస్తోంది అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సంబంధిత మంత్రిత్వ శాఖలకు, ఆయా రాష్ట్రాలకు సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ్ పంచాయత్ హిమ్రీ ప్రాంతంలో అక్రమంగా అడవుల నరికివేత, అనధికార రోడ్డు నిర్మాణం, కలప అక్రమ రవాణా, నియంత్రణ లేకుండా జరుగుతున్న మైనింగ్ వంటి పర్యావరణ ఉల్లంఘనలను స్థానిక నివాసితులతో కలిసి విజయేంద్ర పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి సుప్రీం కోర్టు దృష్టికి పిల్‌ ద్వారా తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణ సంబంధిత ఎన్జీవో ఒకటి వీళ్లతో కలిసింది. 

‘‘మీడియా కథనాలను చూస్తే.. వరదల సమయంలో భారీగా కర్రలు, చెక్క దుంగలు ఆ ప్రవాహంలో కనిపిస్తున్నాయి. అక్రమంగా అడవుల్ని కొట్టడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ప్రాథమికంగా అనిపిస్తోంది.. అని పిల్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ అభిప్రాయపడ్డారు. 

ఇదిలా ఉంటే.. హిమాచల్ ప్రదేశ్‌లో వరద నీటిలో కర్రలు తేలుతూ కనిపించిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్‌ అయ్యింది. పుష్ప సినిమాలో పుష్పరాజ్‌ ఎర్రచందనం దుంగలను నీటి ద్వారా అక్రమ రవాణా చేసే సీన్‌ ఒకటి ఉంటుంది. సరిగ్గా అలాగే హిమాచల్‌ టింబర్‌ మాఫియాలు చేస్తున్నాయంటూ ఓ వీడియో ‘‘రియల్‌ పుష్ప సీన్‌’’ అంటూ వైరల్‌ అయ్యింది. 

ఈ వీడియోనే సీజేఐ ప్రధానంగా ప్రస్తావించినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల నుంచి రెండు వారాల్లో బదులు కావాలని సీజేఐ బెంచ్‌ కోరింది. ఉత్తర భారత దేశంలో పలు రాష్ట్రాల్లో వరదలతో దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. సుమారు 37 ఏళ్‌ల తర్వాత పంజాబ్‌లోనూ దారుణంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement