
అంత అత్యావశ్యకత ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
వారాంతంలో అటవీ భూమిని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి?
అటవీ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అనేది మీరే నిర్ణయించుకోండి
కంచ గచ్చిబౌలి కేసులో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యలు
ప్రస్తుతం పనులు నిలిపివేసినట్లు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది సింఘ్వీ
రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోండి.
..: సీజేఐ జస్టిస్ గవాయ్ :..
సాక్షి, న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేసి సుస్థిర అభివృద్ది కోసమేనని సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న అటవీ భూమిని అంత అత్యావశ్యకంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ సున్నితంగా హెచ్చరించారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ జోమలయ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషనర్ తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
తాజా నివేదికను దాఖలు చేశాం
ప్రస్తుతం కంచ గచ్చిబౌలిలో అన్ని పనులను నిలిపివేసినట్లు ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. అక్కడ ఎటువంటి పనులు జరగట్లేదని, కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర అంశాలతో కూడిన నివేదికను కోర్టులో దాఖలు చేశామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌ను పరిశీలించేందుకు తమకు సమయం కావాలని అమికస్ క్యూరీ పరమేశ్వర్, దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే వారం వాదనలు వింటామని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. దీనిపై స్పందించిన... ప్రతివాదులు మరింత సమయం కావాలని కోరగా.. ఆగస్టు 13కు తదుపరి విచారణను వాయిదా వేశారు. పర్యావరణ అంశాలపై సుప్రీంకోర్టుకు సహాయం చేసేందుకు కేంద్ర సాధికారక కమిటీ (సీఈసీ) స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి తమకు నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
మేం అడవులను కాపాడాం
‘సరే ప్రస్తుతానికైతే అటవీ భూమిని కాపాడారు కదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధర్మాసనం అడిగింది. అది అటవీ భూమా.. కాదా?’అనే అంశంపై మరోసారి విచారణ జరగాల్సిన అవసరం ఉందని సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఆ స్థలంలో చెట్లు సంరక్షించబడ్డాయి. అభివృద్ధి కోసం అడవులను నరకడం అనేది సమంజసం కాదు. సుస్థిర అభివృద్ధిని నేను వ్యక్తిగతంగా సమర్థిస్తాను.
అంటే దానర్థం రాత్రికిరాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి మొత్తం అడవిని ధ్వంసం చేయడాన్ని సమర్థిస్తానని మాత్రం కాదు’అని అన్నారు. అటవీ భూమిని కాపాడకపోతే అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతామని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అనే దానిపై నిర్ణయం తీసుకోండి అని అని జస్టిస్ గవాయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.