
వక్ఫ్ (సవరణ) చట్టం Waqf (Amendment) Act, 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పును వెలువరించింది. చట్టం అమలుపై(అన్ని ప్రొవిజనల్స్)పై స్టే విధించేందుకు నిరాకరిస్తూనే.. చట్టంలో కీలక ప్రొవిజన్స్‌ను నిలిపివేస్తూ సోమవారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. ఇందులో.. ప్రధానంగా ఐదేళ్లు ఇస్లాం మతం ఆచరిస్తేనే వక్ఫ్ చేయాలన్న సెక్షన్ కూడా ఉంది.
కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్(సవరణ)చట్టం-2025పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది.
వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్‌లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిమే ఉండటం మంచిదని పేర్కొంది.
మధ్యంతర ఆదేశాల్లో హైలైట్స్
- వక్ఫ్ ఆస్తులా ? కావా ? అన్నది కోర్టులే నిర్ణయిస్తాయి
- ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆక్రమించిందా? లేదా? అనే అంశంపై నిర్ణయించే అధికారం అధికారులకు కట్టబెట్టిన సెక్షన్ పై స్టే
- ఐదేళ్లు ఇస్లాం మతం ఆచరిస్తేనే వక్ఫ్ చేయాలన్న సెక్షన్ పై స్టే
- ఈ అంశంపై ప్రభుత్వం తగిన నిబంధనలు రూపొందించే వరకు స్టే విధించిన సుప్రీం
- వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్: కోర్టు ఈ అంశంపై తాత్కాలికంగా ప్రభుత్వ చర్యలకు పరిమితి విధించింది. ఇప్పటికే వక్ఫ్‌గా గుర్తించబడిన ఆస్తుల స్థితిని తక్షణంగా మార్చకూడదని సూచించింది.
- వక్ఫ్ బోర్డుల సభ్యత్వం: ముస్లిమేతరుల నియామకంపై అభ్యంతరాలు ఉన్నా.. కోర్టు తాత్కాలిక స్టే ఇవ్వలేదు. కానీ ఈ అంశంపై వివరణాత్మక విచారణ అవసరమని పేర్కొంది.
- సెంట్రల్ వక్ఫ్ బోర్డులో నలుగురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దు
- స్టేట్ వక్ఫ్ బోర్డులో ముగ్గురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దు
- కలెక్టర్ విచారణ ద్వారా ప్రభుత్వ భూమిగా గుర్తింపు: ఈ నిబంధనపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఆ అధికారం కలెక్టరలకు లేదని.. ట్రిబ్యూనల్స్‌కే ఉందని స్టే విధించింది. ఇది ఆస్తుల హక్కులపై ప్రభావం చూపే అంశంగా పేర్కొంది.
- సెక్షన్ 3r - ఇస్లాం ఆచరిస్తూ 5 సంవత్సరాలు కావాలి. నియమాలు రూపొందించకపోతే, అది యాదృచ్ఛిక అధికార వినియోగానికి దారి తీస్తుంది.
- సెక్షన్ 2(c) నిబంధన - వక్ఫ్ ఆస్తి, వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదు.
- సెక్షన్ 3C - రెవిన్యూ రికార్డుల్లో సవాలు చేస్తూ కలెక్టర్‌కు హక్కులు నిర్ణయించే అధికారం ఇవ్వడం, అధికార విభజనకు విరుద్ధం. తుది తీర్పు వచ్చే వరకు ఆస్తుల హక్కులు ప్రభావితం కావు. హక్కు నిర్ణయించకముందు, వక్ఫ్ కూడా ఆస్తి నుండి తొలగించబడదు.
- సెక్షన్ 23 - ఎక్స్ ఆఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందినవారే కావాలి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్‌లో పార్లమెంట్ ఈ బిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకోర్టుకు చేరింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు కాగా.. వీటన్నింటిని ఒక్కటిగా కలిపి కోర్టు విచారణ జరిపి మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ తీర్పు చట్టాన్ని నిలిపివేయకుండా.. కీలకాంశాలపై పరిమితి విధిస్తూ సమగ్ర విచారణకు మార్గం వేసింది. అంతకు ముందు..
ఈ పిటిషన్లను సీజేఐ(పూర్వపు) జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మే 5న విచారణ చేపట్టి, తదుపరి విచారణను మే 15కి వాయిదా వేసింది. ఆపై జస్టిస్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయడంతో.. తదుపరి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు పూర్తి కావడంతో మే 22వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ తీర్పును ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. అయితే ఇది మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. రాజ్యాంగబద్ధతపై పూర్తి విచారణ ఇంకా జరగాల్సి ఉంది.
వాదనలు..
వక్ఫ్ అనేది మతపరమైన అవసరం కాదు, ఇది చారిటబుల్ కాన్సెప్ట్ అని కేంద్రం వాదించింది. అయితే పిటిషనర్లు ఈ చట్టాన్ని అన్యాయమైనది, అసంవిధానమైనది, ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో కోర్టు.. చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని కేంద్రం చెప్పిందని, కాబట్టి పూర్తి స్టే ఇవ్వడం అనవసరం అని అభిప్రాయపడుతూ కీలక అంశాలపై మాత్రం స్టే విధించింది.