
న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయ పాలనే తప్ప, బుల్‌డోజర్ న్యాయం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. న్యాయస్థానం వెలువరించే తీర్పుతోటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ప్రభుత్వమే జడ్జి, లాయర్, అధికారి బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించలేదన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75 ఏళ్లలో ‘చట్ట పాలన’పరిణతి చెందుతూ వస్తోందన్నారు.
చట్ట పాలన కేవలం నిబంధనావళి మాత్రమే కాదు, నైతిక చట్టం ఇది విభిన్న, సంక్లిష్టమైన సమాజంలో సమానత్వాన్ని నిలబెట్టడానికి, వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి, పాలనను మార్గనిర్దేశం చేయడానికి రూపొందించిన నైతిక చట్రమని ఆయన అన్నారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లను కూల్చడం చట్ట పరమైన ప్రక్రియలను మరుగు పర్చడం, నియమాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందంటూ యూపీ ప్రభుత్వంపై కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ పేర్కొనడం తెల్సిందే. వివిధ కేసుల్లో చారిత్రక తీర్పులను ఈ ప్రసంగం సందర్భంగా జస్టిస్ గవాయ్ ఉదహరించారు. ‘రూల్ ఆఫ్ లా ఇన్ ది లార్జెస్ట్ డెమోక్రసీ’అంశంపై మారిషస్‌లో జరిగిన వార్షిక సర్ మౌరిస్ రౌల్ట్ స్మారక ఉపన్యాసం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మారిషస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా 1978–82 సంవత్సరాల్లో జస్టిస్ రౌల్ట్ పనిచేశారు.