కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ- టీఎంసీల మధ్య ఫైట్ తారాస్థాయికి చేరింది. పశ్చిమ బెంగాల్‌లో ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ చర్యతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.
ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పలు డాక్యుమెంట్లను పరిశీలించి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈడీ అధికారుల విధులకు అడ్డుపడుతున్నారని బీజేపీ ఆరోపణలు చేస్తూ, మమతా చర్యలను తీవ్రంగా విమర్శించింది.
బీజేపీ నేతలు..సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఈడీ అధికారుల పనిలో జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధం అని ఆరోపించారు. కేంద్ర సంస్థల పనులను అడ్డుకోవడం ద్వారా టీఎంసీ తమపై ఉన్న అనుమానాలను మరింత బలపరుస్తోందని వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి రాజకీయ వ్యూహకర్తగా ఐప్యాక్ టీం కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ప్రచారంలో టీఎంసీకి వ్యూహరచన, ప్రచార పద్ధతులు, డేటా విశ్లేషణ వంటి అంశాలను ఐప్యాక్ నిర్వహిస్తోంది. ఈడీ సోదాలు, మమతా బెనర్జీ జోక్యం, బీజేపీ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త హైడ్రామాకు దారితీశాయి. ఎన్నికల ముందు ఈ పరిణామాలు టీఎంసీ–బీజేపీ మధ్య పోరును మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


