న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట అక్రమార్కులు సాగిస్తున్న భారీ మనీలాండరింగ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. నేటి (గురువారం) ఉదయం నుంచి దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్, మోతీహరి, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, కేరళలోని ఎర్నాకులం, పందళం, తమిళనాడులోని చెన్నై, గుజరాత్‌లోని రాజ్‌కోట్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, లక్నో తదితర నగరాల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
నిరుద్యోగులను మోసగించి భారీగా నగదు వసూలు చేసిన వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణం తొలుత ఇండియన్ రైల్వేస్‌కు సంబంధించిన ఉద్యోగాల పేరిట మొదలైనప్పటికీ, దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రైల్వేలే కాకుండా అటవీ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ), భారత తపాలా శాఖ, ఆదాయపు పన్ను శాఖ, హైకోర్టు, పీడబ్ల్యూడీ (పీడబ్యూడీ), బిహార్ ప్రభుత్వ శాఖలు, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ), రాజస్థాన్ సెక్రటేరియట్ సహా సుమారు 40కి పైగా ప్రభుత్వ విభాగాలు, సంస్థల పేరిట ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది.
తప్పుడు పద్ధతుల్లో ఈ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి అమాయకుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేసినట్లు విచారణలో తేలింది. బాధితులను నమ్మించేందుకు ఈ ముఠా అత్యంత పక్కాగా స్కెచ్ వేసింది. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను తలపించేలా నకిలీ వెబ్‌సైట్లు, ఈమెయిల్ ఐడీలను సృష్టించి, బాధితులకు నకిలీ నియామక పత్రాలను పంపేవారని ఈడీ అధికారులు తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటూ నిరుద్యోగుల ఆశలతో ఈ కేటుగాళ్లు ఆడుకున్నట్లు స్పష్టమయ్యింది.
ఈ ముఠా అనుసరించిన మరో ఆశ్చర్యకరమైన వ్యూహం ఏంటంటే.. బాధితుల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు వారు ఎంపిక చేసిన కొంతమందికి తొలి రెండు మూడు నెలల పాటు జీతాలను కూడా చెల్లించారు. ఇండియన్ రైల్వేస్‌లోని ఆర్‌పిఎఫ్ (ఆర్‌పీఎఫ్), టీటీఈ (టీటీఈ), టెక్నీషియన్ తదితర పోస్టుల్లో చేరినట్లు భ్రమింపజేసి, వారికి జీతాలు ఇచ్చి, మరికొందరిని వలలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించిన మూలాలను గుర్తించేందుకు ఈడీ లోతైన దర్యాప్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: ‘తుర్క్‌మన్ గేట్’ అల్లర్లలో 30 మంది గుర్తింపు


