బీఎండబ్ల్యూ ఇల్లు.. బెంజ్‌ విల్లా  | Luxury Car Makers are exploring the Indian real estate sector | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ ఇల్లు.. బెంజ్‌ విల్లా 

Jan 8 2026 2:06 AM | Updated on Jan 8 2026 2:06 AM

Luxury Car Makers are exploring the Indian real estate sector

రియల్టీలోకి దూసుకొస్తున్న లగ్జరీ కార్ల కంపెనీలు

ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, గుర్గావ్‌లో ప్రాజెక్టులు  

జాబితాలో లాంబోర్గిని, బీఎండబ్ల్యూ, మెర్సిడిస్‌ బెంజ్‌

లగ్జరీ, బ్రాండెడ్‌ రెసిడెన్షియల్, కన్సల్టెన్సీ సర్వీసులపై దృష్టి

ఇప్పటివరకూ భారత్‌లో విలాసవంత కార్ల విక్రయాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన గ్లోబల్‌ ఆటో దిగ్గజాలు తాజాగా దేశీ రియల్టీ రంగంపై కన్నేశాయి. ప్రధాన ప్రాంతాలలో రియల్టీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా దేశీయంగా సరికొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేయనున్నాయి. ఇందుకు 2026 కేలండర్‌ ఏడాదిలో తెరతీయనున్నాయి.  ముంబై, చెన్నై సహా ప్రధాన నగరాలు, గుర్గావ్, హైదరాబాద్‌ తదితర అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు వివిధ రియల్టీ డెవలపర్స్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే లగ్జరీ కార్ల దిగ్గజం లాంబోర్గిని ప్రమోటర్‌ కుటుంబం దేశీ రియల్టీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుర్గావ్‌లో విలాసవంత బ్రాండెడ్‌ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు మెర్సిడిస్‌ బెంజ్‌ రియల్టీ డెవలపర్స్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఎండబ్ల్యూ సైతం దేశీ రియల్టీ గ్రూప్‌లతో చర్చలు నిర్వహిస్తోంది. అయితే బ్రాండెడ్‌ ప్రాజెక్ట్‌ చేపడుతుందా లేక .. రియల్టీలో కార్యకలాపాలు కలిగిన క్రియేటివ్‌ డిజైన్‌ కన్సల్టెన్సీ అనుబంధ సంస్థ డిజైన్‌వర్క్స్‌పై ముందుకెళుతుందా అనే విషయంపై సందిగ్ధత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. 

ముంబై, చెన్నైలలో 
హైపెర్ఫార్మెన్స్‌ కార్లు, ఎస్‌యూవీలు రూపొందించే లాంబోర్గిని ప్రమోటర్‌ టోనినో ఇప్పటికే ముంబై, చెన్నైలలో ప్రాజెక్టులపై కసరత్తు చేస్తున్నారు. ఇందుకు లాంబోర్గిని టోనినో ఎస్‌పీఏ ద్వారా చర్చలకు తెరతీశారు. కార్ల దిగ్గజం లాంబోర్గినీ వ్యవస్థాపకుడు ఫెరూసియో లాంబోర్గిని కుమారుడితడు. కాగా.. ఇప్పటికే దుబాయ్, మియామీ(ఫ్లోరిడా)లలో ప్రాజెక్టులు చేపట్టిన గ్లోబల్‌ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ దేశీ ప్రణాళికలు వెల్లడికావలసి ఉంది. ఈ బాటలో ఆటోమొబైల్‌ దిగ్గజాలేకాకుండా దేశీయంగా రియల్టీ రంగ కార్యకలాపాలపట్ల ప్రీమియం వెల్‌నెస్‌ బ్రాండ్లు, ఫ్యాషనబుల్‌ క్లాతింగ్‌ సంస్థలు, యూరోపియన్‌ డిజైన్‌ స్టూడియోలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన నగరాలలో బ్రాండెడ్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు పలు రంగాల గ్లోబల్‌ దిగ్గజాలు ఇప్పటికే డెవలపర్స్‌తో విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 

సరికొత్త బ్రాండ్లతో 
సరికొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడంతోపాటు.. నాణ్యతా ప్రమాణాలకు హామీనిచ్చేందుకు వీలుండటంతో దేశీయంగా రియల్టీ డెవలపర్లు సైతం గ్లోబల్‌ దిగ్గజాలవైపు చూస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో సంప్రదాయ బ్రాండెడ్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్లయిన యూఎస్, యూఏఈ, థాయ్‌లాండ్, వియత్నాం తదితరాల జాబితాలో భారత్‌ సైతం చేరనున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో బ్రాండెడ్‌ రెసిడెన్స్‌ సరఫరాలు 55 శాతం జంప్‌చేసినట్లు శావిల్స్‌ బ్రాండెడ్‌ రెసిడెన్స్‌ 2025–26 నివేదిక వెల్లడించింది. ఇందుకు ప్రధానంగా వియత్నాం, థాయ్‌లాండ్‌తోపాటు.. భారత్‌లో వృద్ధి సహకరించినట్లు తెలియజేసింది. ఈ ప్రభావంతో టాటా గ్రూప్‌ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ(తాజ్‌ హోటళ్లు) సైతం చెన్నైలో బ్రాండెడ్‌ రెసిడెన్సీవైపు దృష్టి పెట్టడం గమనార్హం! 

కారణాలున్నాయ్‌.. 
ప్రస్తుతం లైవ్‌ బ్రాండెడ్‌ రెసిడెన్స్‌ ప్రాజెక్టుల విషయంలో భారత్‌ ప్రపంచంలో ఆరో ర్యాంకును ఆక్రమిస్తోంది. గ్లోబల్‌ సరఫరాల్లో నాలుగో స్థానంలో నిలుస్తోంది. చేపట్టనున్న ప్రపంచ ప్రాజెక్టులలో పదో ర్యాంకును అందుకుంది. దేశీ రియల్టీ రంగంలో ఇప్పటికే కార్యకలాపాలు విస్తరించిన గ్లోబల్‌ బ్రాండ్లలో ఫోర్‌ సీజన్స్, రిట్జ్‌ కార్ల్‌టన్, మారియట్, అర్మాణీ కాసా, వెర్సేస్‌ హోమ్, ట్రంప్‌ ఫ్యామిలీ, హయత్, పుల్‌మ్యాన్, ఐటీసీ, హిల్టన్‌ తదితరాలున్నాయి. ఈ బాటలో తాజాగా లగ్జరీ బ్రాండ్ల ఆటో దిగ్గజాలు క్యూ కట్టడం గమనించదగ్గ అంశం!

ఆకర్షణీయ మార్కెట్‌గా 
ఒకప్పుడు దిగ్గజాల లక్ష్యంగా నిలిచిన దుబాయ్, మియామీ, లండన్‌ బాటలో ఇప్పుడు భారత్‌ భారీ పెట్టుబడులు, ప్రాజెక్టులను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్రాండెడ్‌ రెసిడెన్స్‌లకు దేశీయంగా అత్యంత సంపన్నవర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. నోయిసిస్‌ క్యాపిటల్‌ అడ్వయిజర్స్‌ విశ్లేషణ ప్రకారం టైర్‌–1 మార్కెట్లు ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల బాటలో టైర్‌–2 పట్టణాలు సైతం దిగ్గజాలను ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో భువనేశ్వర్, చండీగఢ్, అహ్మదాబాద్, గోవా, సూరత్‌ తదితరాలున్నాయి. గత మూడేళ్లుగా లగ్జరీ ప్రాజెక్టులు జోరందుకోవడం ఇందుకు తోడ్పాటునిస్తోంది!

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement