
కంచ గచ్చిబౌలి భూముల కేసు విచారణలో సీజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు
భూముల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న ప్రభుత్వం
పర్యావరణాన్ని కాపాడే చర్యలు చేపడితే.. అన్ని ఫిర్యాదులు ఉపసంహరిస్తామన్న ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను స్వాగతిస్తున్నామని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. పర్యావరణ పరిరక్షణను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పింది. ‘ఏది ఏమైనా నా రిటైర్మెంట్‌లోపు కంచ గచ్చిబౌలి కేసులో పరిష్కారం చూపాలి’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తేల్చిచెప్పారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం జస్టిస్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మరో పిటిషనర్ తరపున ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం
‘అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం మాకు మరికొంత సమయం కావాలి. వన్యప్రాణులు, అడవి, సరస్సు వంటి వాటిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్దం చేస్తోంది. పర్యావరణం విషయంలో మేం మరింత పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం’అని అభిõÙక్ సింఘ్వీ ధర్మాసనానికి చెప్పారు. ‘ప్రభుత్వ ప్రతిపాదనలను మేం ఆహ్వానిస్తున్నాం.
మీరు మంచి ప్రతిపాదనలతో వస్తే, మేము ఫిర్యాదులన్నీంటినీ ఉపసంహరిస్తాం. ఆ అటవీ ప్రాంతాన్ని రక్షించే మంచి ప్రతిపాదనలతో రండి. అలా వస్తే మిమ్మల్ని (ప్రభుత్వాన్ని) ధర్మాసనం కచ్చితంగా అభినందిస్తుంది’అని జస్టిస్ గవాయ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ధర్మాసనాలు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కానీ, అభివృద్ధి అనేది సుస్థిరంగా ఉండాలని పదే పదే ప్రభుత్వానికి సూచించామని చెప్పారు.
అభిపృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు పర్యావరణం, వన్యప్రాణుల ప్రయోజనాలను ధ్వంసం చేసే చర్యలకు ఎవరూ ఉపసంహరించకూడదని ధర్మాసనం సూచించింది. ‘ఈసారి ధర్మాసనం ముందుకొచ్చే సమయానికి ప్రభుత్వ ప్రతిపాదనలు చాలా అద్భుతంగా ఉంటాయని, ఇందుకు మాకు 6–8 వారాల సమయం కావాలి’అని అభిషేక్ మనుసింఘ్వీ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసు విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.