సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైకోర్ట్ అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు దంపతుల జంట హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో, ఆయన విచారణకు హాజరు కానున్నారు.
వివరాల ప్రకారం.. హైకోర్ట్ అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు దంపతుల జంట హత్య కేసు విచారణలో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో పుట్ట మధుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు రామగుండంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక, ఇప్పటికే మృతుడు వామన్ రావు తండ్రి కిషన్ రావుతో పాటు, వారి కుటుంబీకులు, బంధువులు, పలువురిని సీబీఐ విచారించింది. కాగా, రామగుండం కమిషనరేట్ కేంద్రంగా గత నెల రోజుల నుంచీ ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరుగుతోంది. అయితే, పుట్ట మధు సీబీఐ విచారణతో ఈకేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.


