హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐడిపిఎల్ డీమార్ట్ ముందు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని అతివేగంతో వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


