సాక్షి, హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్, వీడియో వ్లోగర్ అన్వేష్‌కు మరో షాక్ తగిలింది. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి దూషించాడన్న ఫిర్యాదు నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అన్వేష్‌ను దేశ ద్రోహిగా ప్రకటించాలని.. భారత దేశానికి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నా అన్వేషణ అనే చానెల్స్, పేజీలతో అన్వేష్ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే.. అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణలో వరుస ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. దేవుళ్లను దూషించినందుకు సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో అన్వేష్‌ఫై 352, 79, 299 BNS SEC 67IT ACT నమోదు చేశారు. త్వరలో అన్వేష్‌కు నోటీసులు జారీ చేస్తామని పంజాగుట్ట పోలీసులు అంటున్నారు.
మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ వ్యాఖ్యలతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్వేష్ వరుస వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హిందూ దేవతలను కించపర్చే విధంగా మాట్లాడటంతో అన్వేష్‌పై అటు హిందూ సంఘాలు, ఇటు నెటిజన్లు మండిపడుతున్నారు.
మరో వైపు, ఈ పరిణామాల తర్వాత అన్వేష్ సోషల్ మీడియా ఖాతా నుంచి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు తప్పుకుంటున్నారు. ‘‘నా అన్వేష్ యూట్యూబ్’ ఛానల్‌ను గత రెండ్రోజులుగా లక్షల మంది అన్ సబ్‌స్క్రయిబ్ చేశారు. ఆ తర్వాత మరో వీడియోలో తాను చేసిన వ్యాఖ్యలకు అన్వేష్ క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. నెటిజన్స్ మాత్రం శాంతించడం లేదు.


