
అమెరికా టెక్సాస్ డల్లాస్ నగరంలో జరిగిన ఎన్నారై దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటక మూలాలున్న చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్య(50)ను యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా తల నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డల్లాస్ సిటీ సామ్యూల్ బౌలేవార్డ్‌లో డౌన్‌టౌన్ సూట్స్ మోటల్ ఉంది. ఇందులో చంద్ర నాగమల్లయ్య(50) మేనేజర్‌గా పని చేసేవాడు. అదే హోటల్‌లో క్యూబాకు చెందిన యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ సిబ్బందిగా పని చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీన నాగమల్లయ్య పాడైపోయిన వాషింగ్ మెషిన్ విషయంలో కోబాస్‌కు ఏదో సూచన చేశాడు. అయితే అది నేరుగా చేయకుండా.. పక్కన ఉన్న మరో మహిళా సిబ్బందికి చెప్పి అతనికి చెప్పమన్నాడు. ఇది కోబాస్‌కు కోపం తెప్పించింది.
తన గదిలో ఉన్న కత్తితో నాగమల్లయ్యను కోబాస్ వెంటాడి చంపాడు. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌లో నాగమల్లయ్యను కోబాస్ ఆ మోటల్ కారిడార్‌లో కత్తితో వెంబడించిన దృశ్యాలు రికార్డయ్యాయి. నాగమల్లయ్య కొడుకు(18)బేస్‌బాల్ బ్యాట్‌తో కోబాస్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. నాగమల్లయ్యను అతని భార్యాకొడుకు ముందే కిరాతకంగా తలనరికి చంపాడు కోబాస్. అంతటితో ఆగకుండా..
ఆ తలను కాలితో ఫుట్‌బాల్‌లాగా తన్నాడు. అది కాస్త దూరం దొర్లుకుంటూ వెళ్లాక.. దానిని చెత్తబుట్టలో పడేశాడు. ఇది కూడా అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యింది. ఆపై పోలీసులు హత్యానేరం కింద కోబాస్‌ను అరెస్ట్ చేసింది. తొలుత క్షణికావేశంలో జరిగిన హత్య అని.. కాదు జాత్యాంహకార హత్య అని.. ఇలా రకరకాల కోణాల్లో చర్చ జరిగింది. అయితే..

నిందితుడు యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) అందించిన వివరాల ప్రకారం.. కోబాస్-మార్టినెజ్‌కు క్యూబాకు చెందిన వ్యక్తి. అమెరికాకు అక్రమంగా వచ్చిన వలసదారు. పైగా అతనిపై అమెరికాలోనే ఇంతకు ముందు దాడులు, దొంగతనాలకు పాల్పడిన తీవ్రమైన నేరచరిత కూడా ఉంది. అయితే.. క్యూబా ప్రభుత్వం అతనిపై ఉన్న తీవ్ర నేరాల దృష్ట్యా వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో బైడెన్ పాలనలో సూపర్వైజన్ ఆర్డర్ కింద Immigration and Customs Enforcement కస్టడీ నుంచి ఈ ఏడాది జనవరిలో అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఆనాడు అలా విడుదల చేయకుంటే లీగల్‌గా సమస్యలు ఎదురయ్యేవి.
ఈ ఘటనపై భారతీయ సమాజం, అంతర్జాతీయ వేదికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత హింసాత్మకంగా జరిగిన ఈ హత్య.. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై, అలాగే ప్రవాస భారతీయుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. “బాబ్” అనే ముద్దుపేరుతో స్నేహితులు పిలిచే నాగమల్లయ్యను కర్తవ్యపరుడని, మానవతావాదిగా గుర్తు చేస్తోంది. మరోవైపు.. భారతీయ కమ్యూనిటీలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం, ఫ్యూనరల్ ఖర్చులు, కుమారుడి విద్యా ఖర్చుల కోసం ఫండ్ రైజర్ ఏర్పాటు చేశాయి. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.