డమాస్కస్: ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్‌కు చెందిన ముష్కరుడొకరు సాగించిన ఆకస్మిక దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా, మరో ముగ్గురు సర్వీస్ సభ్యులు గాయపడినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఈ ఘటన సిరియాలో జరిగింది. CENTCOM అనేది మిడిల్ ఈస్ట్‌లో అమెరికన్ మిలిటరీ కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ. ఈ విషయాన్ని వారు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
BREAKING:
3 U.S. soldiers shot and wounded in an ambush in Syria during an anti-ISIS patrol near Palmyra.
The soldiers have been airlifted to the Al-Tanf base on the border with Iraq and Jordan pic.twitter.com/xWrlNc37RV— Visegrád 24 (@visegrad24) December 13, 2025
ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు యూఎస్ సైనిక సిబ్బంది, ఒక యూఎస్ పౌరుడు ఉన్నారని CENTCOM నిర్ధారించింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఆ పౌరుడు అమెరికన్ అనువాదకునిగా పనిచేస్తున్నారు. గాయపడిన ముగ్గురు సర్వీస్ సభ్యులను చికిత్స నిమిత్తం ఆల్-తన్ఫ్ గారిసన్‌కు హెలికాప్టర్‌లో తరలించారు. కాగా ఐఎస్‌ఐఎస్ ముష్కరుడిని అమెరికన్ బలగాలు వెంటనే ఎదుర్కొని మట్టుబెట్టాయి. ఈ దాడులు సిరియాలోని పాల్మైరా సమీపంలో జరిగాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొంటున్న సైనికులపై ఈ ఆకస్మిక దాడి జరిగింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ, ఇది ISIS దాడి అని ధృవీకరించారు. దీనికి తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. మరణించిన ముగ్గురిని అమెరికన్ దేశభక్తులుగా ట్రంప్ అభివర్ణించారు. గాయపడిన సైనికులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.


