అమెరికా అధ్యక్ష పీఠాన్ని డోనాల్డ్ ట్రంప్ దాదాపు పది నెలల క్రితం అధిరోహించాక ఎన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఆ వరసలో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా రాక కూడా ఒకటి. ఒక దేశాధ్యక్షుణ్ణి మీడియా సాక్షిగా తీవ్రంగా మందలించటం, ఆయనతో వాదులాటకు దిగటంతో ట్రంప్ ఏలుబడి మొదలైంది. కానీ ఆ ‘సత్కారం’ అందుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దాన్నంతటినీ దిగమింగుకుని అనంతర కాలంలో ట్రంప్‌తో చేతులు కలిపి, తమ ఖనిజ సంపద అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఆయన మెప్పు పొందారు.
ఇప్పుడు షరాకు రెడ్ కార్పెట్ పరచటంలోని అంతరార్థం ఏమిటో మున్ముందు తెలుస్తుంది. పైకి చెబుతున్న కారణమైతే ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై పోరాటానికి సంఘటితమైన 88 దేశాలతో సిరియా చేతులు కలపటానికి సిద్ధపడటం. తాము ఏమనుకుంటే మిగతా ప్రపంచం కూడా అలాగే అనుకోవాలని అమెరికా భావిస్తుంటుంది. ఏడేళ్ల క్రితం అమెరికా దృష్టిలో అల్ షరా కరుడుగట్టిన ఉగ్రవాది. అతన్ని పట్టిస్తే కోటి డాలర్లు ఇస్తామంటూ ప్రకటించింది. నిరుడు డిసెంబర్‌లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆ నజారానాను ఉపసంహరించుకున్నారు.
మొన్న జూలైలో షరా ఆధ్వర్యంలోని హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్)పై ఉగ్రవాద సంస్థ ముద్రను రద్దుచేశారు. సిరియాపై ఉన్న ఆర్థిక ఆంక్షలను రద్దు చేస్తామని మే నెలలో ప్రకటించటంతోపాటు సౌదీ అరేబియాలో ట్రంప్ ఆయన్ను కలుసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో షరా అధ్యక్ష హోదాలో అమెరికా సందర్శిస్తారనగా మొన్న గురువారం ఆదరాబాదరాగా భద్రతా మండలి సమావేశమై నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. చైనా మినహా మిగిలిన 14 సభ్య దేశాలూ మరో మాట లేకుండా ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి.
అమెరికా తాజా నిర్ణయాలు తప్పని, గత వైఖరే సరైందని ఎవరూ అనరు. కానీ తల్చుకున్నదే తడవుగా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటం, వాటికి భద్రతా మండలి వంటి సంస్థలు సైతం ఎలాంటి ప్రశ్నలూ లేవనెత్తకుండా అంగీకరించటం ఆందోళన కలిగించే అంశం. అమెరికా ఆగ్రహించినంత కాలమూ ఆ దేశంతో సంబంధాలు కలిగి ఉన్నందుకు అమెరికా తీసుకున్న చర్యలతో నష్టపోయిన దేశాల మాటేమిటి? ఇప్పుడు ఇరాన్‌పైనా, రష్యాపైనా ఆంక్షలున్నాయి. వాటితో వాణిజ్య సంబంధాలు నెరపుతున్నందుకు మన దేశంపై ట్రంప్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందరూ తమకు తోకల్లా ఉండాలన్నది అమెరికా విధానం.
సిరియాపై అమెరికా ఆంక్షలు ఈనాటివి కాదు. గత ఎనభైయ్యేళ్లుగా... అంటే 1946లో ఆ దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటినుంచి కొనసాగుతున్నాయి. 1979లో రీగన్, అటుతర్వాత జార్జి బుష్, ఒబామా వాటిని మరింత పెంచారు. 2003లో అమెరికా ఇరాక్‌ను దురాక్రమించినప్పుడు షరా పట్టుబడ్డారు. ఆయన్ను 2011 వరకూ అమెరికా జైల్లో నిర్బంధించారు. అక్కడ పరివర్తన పొంది విడుదలయ్యాక సిరియా వెళ్లి అల్ కాయిదాతో, అటుతర్వాత ఐఎస్‌తో చేతులు కలపటం, హెచ్‌టీఎస్ స్థాపించటం, 2013లో అమెరికా ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించటం చరిత్ర.
షరా పలుకుబడి ఉన్న ఉత్తర సిరియా ప్రాంతంలో ఐఎస్ చీఫ్ అబూ బకర్ బగ్దాదీని 2019లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఆ మాటెలా ఉన్నా ప్రస్తుతం ఆయన ఏలుబడిలో గత పది నెలలుగా సిరియాలోని మైనారిటీ వర్గాలైన అలావైట్‌లు, డ్రూజ్‌లు, క్రైస్తవులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. షరా అనుకూల మిలిటెంట్ సంస్థలు ఇళ్లల్లోకి చొరబడి కాల్చిచంపటం, ఎత్తయిన భవంతుల నుంచి దూకమని హుకుం జారీచేసి ప్రాణాలు తీయటం కొన సాగుతోంది.
మొన్న మార్చిలో దాదాపు 2,000 మంది ఆ హింసాకాండకు బలయ్యారు. వాటి నివారణపై ట్రంప్, షరా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ శిథిలాల దిబ్బగా ఉన్న సిరియాలో 90 శాతంమంది పౌరులు తీవ్ర దారిద్య్రంలో మగ్గుతున్నారు. దేశ పునర్నిర్మాణానికి కనీసం 20,000 కోట్ల డాలర్లు అవసరమవుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా. ట్రంప్–షరా సమావేశం తర్వాతైనా సిరియాలో సాధారణ పరిస్థితులు నెలకొని, అది ఆర్థికంగా పుంజుకుంటే మంచిదే.


