మీరు మీ పుస్తకం గురించి రీల్ చేస్తారు. అది ఇన్‌స్టాలో ప్లే అవుతుంది. ఆ పుస్తకం మార్కెట్‌లోకి వచ్చేలోపు ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ ఒకడు ఆ పుస్తకాన్ని చూపుతూ, అందులో ఏముందో రివ్యూ చేస్తూ రీల్ చేస్తాడు. తళతళమనే కవర్‌పేజ్‌ను చూపుతూ అతడు ఆ పుస్తకం గురించి చెప్పాడంటే అతన్ని ఫాలో అవుతున్న వారందరికీ సమాచారం చేరినట్టే.
ఈ రీల్స్/వీడియోల కింద అమెజాన్ లింకులు ఉంటాయి. రీల్ చూసి ఇంప్రెస్ అయ్యి అమెజాన్ లింక్ క్లిక్ చేశామంటే పుస్తకం మన ముంగిట్లో ఉన్నట్టే. అలా అమ్మకాలు సాగుతున్నాయి ఇప్పుడు. అలా అమ్ముతూ రాయల్టీ చెక్కులు పొందుతున్నారు నేటి యువ రచయితలు. యువతరం వలన, యువతరం చేత, యువతరం కొరకు సాగుతున్న రచనా చమత్కృతి ఇది.
‘తెలుగు కాపాడండి మొర్రో’ అనేవాళ్లు ప్రతి కాలంలో ఉన్నట్టే ఈ కాలంలోనూ ఉన్నారు. ఈ కుయ్యో మొర్రోల వల్ల తెలుగు నిలబడదు. కుయ్యో మొర్రో అనకపోతే నశించిపోదు. ప్రతి ఊళ్లో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఊరవతల ఇంజనీరింగ్ కాలేజీ ఉన్న ఈ కాలంలో తెలుగు బాగా మాట్లాడుతూ, చదువుతూ, రాయాలన్న అభిలాష ఉన్న వందల మంది తెలుగు యువతీ యువకులను చూస్తే ఒక మాతృభాష లేదా జీవభాష ఎలా పదేపదే పునరుత్థానం అవుతూ ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది.
ఇప్పుడు జరుగుతున్న ‘హైదరాబాద్ బుక్‌ఫెయిర్’లో 30 ఏళ్ల లోపు యువతీ యువకులు రాసిన కనీసం 100 తెలుగు పుస్తకాలు ఉన్నాయంటే నమ్ముతారా? ప్రతి సాయంత్రం వారు తూనీగ రెక్కలతో అక్కడ వాలి, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం చూస్తున్నారా? కథ, కవిత కాకుండా ఏకంగా మొదలట్టడమే నవల రాసేసి నవలా రచయితలుగా కాలు మీద కాలేసి కూచోవడం గమనిస్తున్నారా? తెలుగు భాషకు వీళ్లు నవ ప్రచారకర్తలు.
సాహిత్యానికి అనేక పార్శా్వలు, లక్ష్యాలు ఉన్నాయి. సాహిత్యాన్ని ఎందుకు సాహిత్యం అంటామో, సాహిత్యం అనడానికి దానికి ఏం అర్హతలు ఉండాలో ప్రపంచవ్యాప్తంగా ప్రమాణాలు స్థిరపడి ఉన్నాయి. అలాగే వీటితో సంబంధం లేని కాలక్షేప సాహిత్యం ఎప్పుడూ చలామణీలో ఉంది.
పాశ్చాత్య దేశాలలో ఈ కాలక్షేపాన్ని రాసి కోట్లు గడించినవారు ఉన్నట్టే... తెలుగులోనూ ‘కమర్షియల్’ నవలలు రాసి, నాటకీయ కల్పనలకు, కొద్దిపాటి తెలివి జోడించి, పామర పాఠకులే లక్ష్యంగా లక్షలు గడించి మేడలు కట్టుకుని స్థిరపడినవారు ఉన్నారు. అన్నిచోట్లా ఉన్నట్టే ఈ ‘కమర్షియల్’ రచయితలు, ‘సీరియస్’ రచయితలు ఒక వేదికపై కనిపించడం దుర్లభం. గత కాలపు ‘కమర్షియల్’ రచయితలకు తామేమి రాశారో, ఆ రచనల అంతస్థు ఏమిటో తెలుసు.
అయితే ఇప్పటి ఈ యువ రచయితలు ఏమి రాస్తున్నట్టు? అవి కాలక్షేప రచనల కోవకు వస్తున్నాయా లేదా సాహితీ ప్రమాణాలకు నిలబడగలవా? కొన్ని రచనలు చేసి, సినిమా రంగాన్ని ఆకర్షించి ఆ రంగంలో స్థిరపడాలనుకునే రచయితలు వీరిలో ఉన్నారు. వారి దారి స్పష్టం. కేవలం అమ్మకాల ఆధారంగా డబ్బు సంపాదించాలనుకునేవారు ఉన్నారు. వారి దారీ స్పష్టం. అలా కాకుండా ‘మంచి రచనలు’ చేసి, సమకాలీన జీవనాలను ప్రతిబింబించి, సీరియస్ సాహిత్యకారులుగా ప్రయాణం సాగించాలనుకునేవారు ఉంటే వారి గురించి సాహితీ సమాజానికి బాధ్యత ఉన్నట్టే లెక్క. ఇప్పుడు హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో ఈ కోవకు చెందిన వారూ తప్పక ఉన్నారు. వీరు సాహిత్యానికి ఆశాకిరణాలు.
‘శ్రీశ్రీ ఏమి రాశాడనండీ’, ‘అబ్బే.. కాళీపట్నం కథల్లో గట్టిగా నిలిచేవి ఎన్ననీ’ అని వారి కాలంలో వారిని ధిక్కరించి మాట్లాడిన యువకులు ఉన్నారు. అయితే వారంతా వారిని క్షుణ్ణంగా చదివినవారు. కొత్తది వచ్చి పాతదాన్ని నిలదీయాల్సిందేగానీ పాతను తెలుసుకుంటేనే నిలదీయడం సాధ్యం. పాతను తెలుసుకునే కొద్దీ వినమ్రత కూడా
చోటు చేసుకుంటుంది– తండ్రి గొప్పదనం ఒక వయసు వచ్చాకే తెలిసినట్టు. ఇప్పటి యువ రచయితలు పాతవి చదవకపోతే ఫరవాలేదుగానీ చదవక్కర్లేదు అనుకుంటేనే ప్రమాదం.
‘ఈ కొత్త పిల్లలు రాసే దాంట్లో ఏముంటుంది’ అనీ సీనియర్లు అనుకోవచ్చుగానీ అసలు వారిని చదవకుండా దూరం పెట్టాలనుకోవడం అవివేకం. ఈ కొత్త, పాతల ఇంటరాక్షన్ ఇప్పుడు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో నాలుగు గట్టితాళ్లు దొరికితే వారధులు నిర్మితమవుతాయి. కొన్ని కెరటాల్ని పసిగడితే జలధి ఏర్పడుతుంది.నేటి యువతర సాహిత్యం కేవలం పొంగు కారాదు. జాతరలో కుర్రాళ్ల సందడి భలే. కానీ వీరిని చిద్విలాసంగా పరికించే పెద్దలు ఉంటారు. వీరిద్దరూ కలిసి ఏం చేయబోతారనేది తెలుగు సాహిత్యానికి సిసలైన కోలాహలం అవుతుంది.


