అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మధ్య భేటీ ముహూర్తం ఖరారైంది. నవంబర్ 10వ తేదీన డొనాల్డ్ ట్రంప్‌ను సిరియా తాత్కాలిక అధ్యక్షుడు ఆల్ షరా వాషింగ్టన్‌లో కలవనున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
సిరియా అధ్యక్షుడు అధికారికంగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు రావడం ఇదే తొలిసారి. అంతకుముందు ఎప్పుడూ సిరియా అధ్యక్షుడికి అమెరికా నుంచి అధికారిక ఆహ్వానం అందలేదు. దీనికి కారణం వారి మధ్య ఉన్న శత్రుత్వమే. ఇరుదేశాల మధ్య గతంలో అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీనిలో భాగంగానే తమ శత్రు దేశమైన సిరియాకు ఆహ్వానం పంపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో అమెరికా-సిరియాల సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉండేవి. సిరియాలోని అంతర్గత యుద్ధం, ఉగ్రవాద సంస్థల ప్రాబల్యం, మానవ హక్కుల ఉల్లంఘనలకు సిరియా పాల్పడుతోందని అమెరికా విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే ఆ దేశంపై కఠినపై ఆంక్షలు విధించింది అమెరికా. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో సిరియాను తమ దారికి తెచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు ట్రంప్. అందులో భాగంగానే సిరియా అధ్యక్ష పదవిలో ఉన్న అల్ షరాకు ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ప్రధానంగా ఇజ్రాయిల్, ఇరాన్, రష్యా వంటి తదితర దేశాలు ఈ భేటీని నిశితంగా గమనించే అవకాశం ఉంది.
25 ఏళ్లలో తొలిసారి..
ఈ ఏడాది మే నెలలో సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా భేటీ అయ్యారు. ఇది 25 ఏళ్లలో అమెరికా, సిరియాల మధ్య జరిగిన మొదటి సమావేశం. ఈ సమావేశం తరువాత సిరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్.


