సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో యూదులపై కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ రెండుసార్లు వివాహం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ 1999లో యూరోపియన్ మహిళ వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడు. తొలుత అక్కడ అమలులో ఉన్న సాధారణ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ సాజిద్ తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి నిఖా జరిగింది.
వీరికి 2001 ఆగస్టు 12న నవీద్ జన్మించగా.. అతడి 15వ ఏట తండ్రితో కలిసి హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో కొద్దిరోజులు టోలిచౌకీలో ఉండి దూద్‌బౌలీలో కొన్ని స్థిరాస్తుల్ని విక్రయించి వెళ్లినట్లు తెలిసింది. ఉగ్రవాద బాటపట్టిన సాజిద్, నవీద్ భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలను ముందే ఊహించి ఉంటారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సాజిద్ ఆస్తిపాస్తుల్లో తనకు ఉన్న వాటాలను గత ఏడాది ఫిబ్రవరిలోనే వెనెరాకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. నవీద్ 2019లో సిడ్నీలోని అల్–మురాద్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు. అక్కడే ఇతడికి పరిచయమైన వారి ద్వారా ఐసిస్‌లో చేరాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లు ఫిలిప్పీన్స్‌లో ఉన్న మిండానావో ఐలాండ్‌లోని ఐసిస్ శిబిరంలో శిక్షణ తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినప్పటి నుంచి గత ఆదివారం వరకు వీరి కదలికలను పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం ఉదయం వీళ్లు దాదాపు 20 కిమీ ప్రయాణించి బీచ్ వద్దకు చేరుకున్నట్లు ఆధారాలు సేకరించారు. బాండీ బీచ్ మారణహోమంలో పాల్గొన్న ఇరువురిలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో చనిపోగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడిపై న్యూ సౌత్ వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించినవీ ఉన్నాయి. సాజిద్, నవీద్‌లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాజిద్ వినియోగించిన కారులో ఆరు తుపాకులు, రెండు ఐసిస్ జెండాలను కూడా స్వాదీనం చేసుకున్నారు.


