2024లో 46 లక్షల మంది పిల్లల మృత్యువాత
నిరోధించగలిగే వ్యాధుల వల్లే ఈ మరణాలు
ఈ ఏడాది మృతుల సంఖ్య 48 లక్షలకు చేరే ప్రమాదం
గేట్స్ ఫౌండేషన్ గోల్‌కీపర్స్ నివేదికలో వెల్లడి
నిరోధించగల వ్యాధుల వల్ల పిల్లల మరణాల సంఖ్య ఈ ఏడాది పెరుగుతుందని ఓ అధ్యయనం అంచనా వేసింది. ఐదో పుట్టినరోజుకు ముందే వారు లోకం విడవడం ఆందోళన కలిగించే అంశం. వాస్తవానికి ఇటువంటి మరణాలు 25 ఏళ్లుగా తగ్గుముఖం పట్టాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అధ్యయన అంశాలను పొందుపరుస్తూ గేట్స్ ఫౌండేషన్ తన గోల్‌కీపర్స్–2025 నివేదిక విడుదల చేసింది.
దీని ప్రకారం గతేడాది ప్రపంచవ్యాప్తంగా 46 లక్షల మంది పిల్లలు ఐదేళ్ల వయసు వచ్చేలోపే మరణించారు. 2025లో ఈ సంఖ్య 48 లక్షలకు చేరుతుందని అధ్యయనం అంచనా వేసింది. నిరోధించగల వ్యాధుల వల్లే కన్నవారికి వారు దూరం అవుతున్నారని.. టీకాలు, ఇతర చికిత్సలతో కూడిన ఆధునిక వైద్యం ఈ మరణాలను నిరోధించగలదని నివేదిక స్పష్టం చేసింది. గ్లోబల్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ ఫర్ హెల్త్ (డీఏహెచ్) నిధులు పెద్ద ఎత్తున క్షీణిస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
భారీగా తగ్గుముఖం..: డీఏహెచ్ కింద యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి ధనిక దేశాలు, స్వచ్ఛంద సంస్థలు తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాలకు ఆరోగ్య కార్యక్రమాల కోసం నిధులు సమకూరుస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థల బలోపేతం, ప్రజాశ్రేయస్సు మెరుగుదలను డీఏహెచ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో డీఏహెచ్ 80 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. గతేడాది ఇది 49.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది మరింత తగ్గి 39 బిలియన్ డాలర్లు నమోదు కావొచ్చని అంచనా.
వినాశకర పరిణామాలు..: నిధుల కోతలు కొనసాగితే పరిణామాలు వినాశకరంగా ఉంటాయని గోల్‌కీపర్స్–2025 నివేదిక హెచ్చరించింది. డీఏహెచ్ నిధులు 20% తగ్గితే 2045 నాటికి అదనంగా 1.2 కోట్ల మంది పిల్లలు చనిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కోతలు 30 శాతానికి చేరుకుంటే 2045 నాటికి 1.6 కోట్ల మంది పిల్లల మరణాలు సంభవిస్తాయని నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలను చంపేస్తున్న మలేరియా, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, నవజాత శిశువులకు వచ్చే ముప్పులను నివారించే అవకాశాలూ మనముందు ఉన్నాయని గుర్తుచేసింది.
పరిష్కారం ఇదిగో..
ప్రాథమిక ఆరోగ్యానికి ప్రాధాన్యం: బలమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు అత్యంత తెలివైన నిర్ణయం. ఏటా ఒక వ్యక్తికి 100 డాలర్ల (రూ. 9,000) కంటే తక్కువ ఖర్చుతో ఈ వ్యవస్థలు 90% వరకు పిల్లల మరణాలను నివారించగలవు. నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధులను ముందుగానే పసిగడతాయి. సురక్షితమైన ప్రసవాలు జరుగుతాయి.
ఇమ్యునైజేషన్ రెట్టింపు: నిరంతర ఇమ్యునైజేషన్ ప్రక్రియ అత్యుత్తమ విధానం. టీకాలకు ఖర్చు చేసే ప్రతి డాలర్.. ఆర్థిక, సామాజిక ప్రయోజనాల రూపంలో 54 డాలర్ల రాబడిని అందిస్తుంది. న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ల డోసుల తగ్గింపు వంటి ఆవిష్కరణలు 2050 నాటికి దాదాపు 2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఆదా చేయగలవు.
తదుపరితరం ఆవిష్కరణల్లో పెట్టుబడి: 2045 నాటికి మలేరియా నివారణలో భాగంగా నూతన సాధనాలు 57 లక్షల మంది పిల్లల ప్రాణాలను కాపాడగలవు. రెస్పిరేటరీ సిన్సీíÙయల్ వైరస్, గ్రూప్–బి స్ట్రెప్టోకాకస్ వంటి ముప్పుల కట్టడి కోసం ప్రసూతి టీకాలను పెంచడం 34 లక్షల మంది పిల్లలను కాపాడగలదని అంచనా.
ప్రపంచం ధనికంగా మారింది. అయినప్పటికీ అత్యంత పేద పిల్లలకు సహాయపడే డబ్బులో మనం అసమాన కోతలు విధించినందున వారిలో ఎక్కువ మంది చనిపోతుండటం విషాదకరం. మానవ చరిత్రలో అత్యంత అధునాతన శాస్త్ర, ఆవిష్కరణలను పొందగలిగిన తరం మనదే కావచ్చు. కానీ ఈ తరం ప్రాణాలను కాపాడేలా నిధులు సమకూర్చుకోలేకపోయాం. 
– బిల్ గేట్స్, ఛైర్మన్, గేట్స్ ఫౌండేషన్


