
టెస్లా అధినేత, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం 485 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. తన సంపదను దానం చేసే గివింగ్ ప్లడ్జ్ తీసుకున్న ఎలాన్ మస్క్‌కు అలా చేయొద్దని, ఆయన సంపదను బిల్‌గేట్స్‌కు మాత్రం ఇవ్వొద్దని సలహా ఇచ్చినట్లు పేపాల్ (PayPal) వ్యవస్థాపకుడు, బిలియనీర్ ఇన్వెస్టర్ పీటర్ థీల్ తాజాగా వెల్లడించారు.
2012లో ఎలాన్ మస్క్.. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ (Bill Gates), వారెన్ బఫెట్‌లు కలిసి తీసుకొచ్చిన "గివింగ్ ప్లెడ్జ్" చొరవపై సంతకం చేశారు. దీని ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ సంపదలో కనీసం సగం భాగాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలి.
రాయిటర్స్‌కు లభించిన ఉపన్యాస సిరీస్ ట్రాన్స్‌క్రిప్ట్‌లు, ఆడియో రికార్డింగ్స్ ప్రకారం.. గివింగ్ ప్లెడ్జ్ ప్రకారం బిల్ గేట్స్ ఎంపిక చేసిన వామపక్ష సంస్థలకు ఆయన సంపద వెళ్తుందని మస్క్‌కు థీల్ (Peter Thiel) చెప్పాడు. ఈ సంభాషణ సందర్భంగా దైవ విరోధుల చేతుల్లోకి అధికారం వెళ్తే ప్రపంచానికే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వెలిబుచ్చారు.
తన సంపదను విరాళంగా ఇవ్వవద్దని థీల్ మస్క్‌కు సలహా ఇచ్చినప్పుడు, "మరి నేనేమి చేయాలి- నా పిల్లలకు ఇవ్వాలా?" అని మస్క్ అడిగినట్లు థీల్ చెప్పారు. దీనికి థీల్ ఇచ్చిన సమాధానం.. "బిల్ గేట్స్‌కు ఇవ్వడం మాత్రం చాలా తప్పు". బిలియనీర్లు మరణం తర్వాత వారి సంపద విధి గురించి మరింత విమర్శనాత్మకంగా ఆలోచించాలని థీల్ వాదించారు. ఒక వేళ సంవత్సరంలోపు మస్క్ మరణిస్తే బిలియన్‌ల డాలర్లు గేట్స్ చేతుల్లోకి వెళ్తాయన్నారు. గేట్స్ చొరవ వంటి వాగ్దానాల ద్వారా సంపదను ఇతరులు నిర్దేశించడానికి అనుమతివ్వడం అంత మంచిది కాదని థీల్ సూచించారు.
కాగా ఎలాన్ మస్క్ 2012లో "గివింగ్ ప్లెడ్జ్"పై సంతకం చేశారు. కానీ తన సంపదను ఎలా వినియోగించాలన్నది మాత్రం ఆయన వివరంగా పేర్కొనలేదు.
ఇదీ చదవండి: ఈ దుబాయ్ యువరాణి ఎంత రిచ్ అంటే..