చైనా కంపెనీ దెబ్బకు.. వెనుకబడ్డ మస్క్ టెస్లా! | Tesla Loses Place as World Top EV Seller to China BYD | Sakshi
Sakshi News home page

చైనా కంపెనీ దెబ్బకు.. వెనుకబడ్డ మస్క్ టెస్లా!

Jan 3 2026 12:39 PM | Updated on Jan 3 2026 1:03 PM

Tesla Loses Place as World Top EV Seller to China BYD

అమ్మకాల్లో అగ్రగామిగా కొనసాగిన అమెరికా కార్ల తయారీ దిగ్గజం టెస్లా డీలా పడింది. ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న పోటీ, సుంకాల ప్రభావం, మస్క్ రాజకీయ ఎత్తుగడలు అన్నీ.. టెస్లా అమ్మకాలను దెబ్బతీశాయి. దీంతో బీవైడీ కంపెనీ అమ్మకాల్లో.. టెస్లాను అధిగమించి మొదటి స్థానం కైవసం చేసుకుంది.

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ.. 2025 చివరి మూడు నెలల్లో 4,18,227 డెలివరీలను పూర్తి చేసింది. దీంతో ఏడాది మొత్తం విక్రయాలు 1.64 మిలియన్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు 2024తో పోలిస్తే ఎనిమిది శాతం కంటే ఎక్కువ తగ్గుదలను సూచిస్తుంది. ఇదే సమయంలో బీవైడీ కంపెనీ.. గత సంవత్సరం 2.26 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి ముందువరుసలో నిలిచింది.

టెస్లా అమ్మకాలు తగ్గడానికి కారణం
2024లో మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత ఫెడరల్ కార్మికులను విస్తృతంగా తొలగించడం వెనుక వివాదాస్పద "గవర్నమెంట్ ఎఫీషియన్సీ" ప్యానెల్ (DOGE)కు నాయకత్వం వహించడం కూడా భిన్నాభిప్రాయాలకు దారితీసింది. ఆ తరువాత చాలామంది పెద్ద ఎత్తున టెస్లా సౌకర్యాల వద్ద నిరసనలు తెలిపారు. ఇది కంపెనీ కార్ల అమ్మకాలపై గణనీయమైన ప్రభావం చూపింది.

ధరలు
మరో ప్రధానమైన కారణం ఏమిటంటే.. 'ధరలు'. బీవైడీ కంపెనీ చాలావరకు అఫర్డబుల్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు, ప్లగ్ఇన్ హైబ్రిడ్ వాహనాలు ఉన్నాయి. అయితే టెస్లా కంపెనీ మాత్రం.. ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అంటే వీటి ధరలు చాలా ఎక్కువన్నమాట. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల మధ్యతరగతి కొనుగోలుదారులు.. టెస్లా కార్లకు ప్రత్యామ్నాయంగా బీవైడీ కార్లను కొనుగోలు చేస్తున్నారు.

చైనా ఆటోమొబైల్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో బీవైడీ కంపెనీ అక్కడ అతిపెద్ద మార్కెట్ షేర్ కలిగి ఉంది. టెస్లా కంపెనీకి ఈ విషయంలో అంత పెద్ద వాటా లేదని తెలుస్తోంది. దీనివల్ల అక్కడ కూడా అమ్మకాలు తక్కువ. అమెరికాలో కూడా టెస్లా అమ్మకాలు మందగించాయి. యూరప్‌లో టెస్లాకి కొన్ని మార్కెటింగ్/పాలిసీ సమస్యలు ఎదురయ్యాయి.

బీవైడీ విస్తరణ
2003లో ప్రారంభమైన టెస్లా కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, అమ్మకాల్లో ముందువరుసలో కొనసాగుతూ వచ్చింది. అయితే దీనికి చైనా వాహన తయారీ సంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) సంస్థ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. బీవైడీ కంపెనీ చైనా మార్కెట్లో మాత్రమే కాకుండా.. యూరోప్, ఆసియా, లాటిన్ అమెరికా వంటి మార్కెట్లలో కూడా తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయంలో టెస్లా చాలా వెనుకబడి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement