
ప్రపంచవ్యాప్తంగా రాజ కుటుంబాలు ముఖ్యంగా వారి విలాసవంతమైన జీవనశైలి, వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే దుబాయ్ యువరాణి (Dubai Princess) షేఖా మహ్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచూ తన జీవనశైలి, వ్యాపార యత్నాలు, సొంత ప్రయాణాల గురించి అభిమానులతో పంచుకుంటారు.
షేఖా మహ్రా నేపథ్యం
1994 ఫిబ్రవరి 26న జన్మించిన షేఖా మహ్రా (Sheikha Mahra).. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. ఆమె తన ప్రారంభ విద్య దుబాయ్‌లోని ప్రైవేట్ పాఠశాలలో పూర్తి చేసి, లండన్‌లో అంతర్జాతీయ సంబంధాల్లో డిగ్రీ పొందారు. ఆమె పరోపకార కార్యకలాపాలలోనూ చురుకుగా పాల్గొంటారు. స్థానిక డిజైనర్లకు సహకారం అందిస్తుంటారు.
షేఖా మహ్రా నెట్‌వర్త్
పలు నివేదికల ప్రకారం.. షేఖా మహ్రా నెట్‌వర్త్ 300 మిలియన్ డాలర్ల నుండి 1.5 బిలియన్ల డాలర్ల (రూ.2,600 కోట్ల నుంచి రూ.13,000 కోట్లు) మధ్య ఉంటుందని అంచనా. ఆమె సంపాదనకు ఆమె కుటుంబ వారసత్వం, వ్యాపారంలో విజయాలు, 2024లో ప్రారంభించిన లగ్జరీ పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ "మహ్రా ఎం1"తో సహా పలు కారణాలు దోహదం చేశాయి. తన వ్యక్తిగత అనుభవం ప్రేరణతో "డివోర్స్" పేరుతో ఆమె తన బ్రాండ్ మొదటి ఫ్రాగ్రన్స్‌ను విడుదల చేయగా విజయవంతమైంది.
విలాసవంతమైన జీవనశైలి
షేఖా మహ్రా విలాసవంతమైన జీవనశైలితో ప్రసిద్ది చెందారు. రోల్స్ రాయిస్, లంబోర్ఘిని, ఫెరారీ వంటి లగ్జరీ కార్లెన్నో ఆమె వద్ద ఉన్నాయి. ఆమె సంపాదన నెలకు సుమారు 5 మిలియన్ డాలర్లు (రూ.41 కోట్లు). ఆమెకు గుర్రాలంటే అమితమైన ఇష్టం. ఫ్యాషన్ సెన్స్ కూడా మహ్రా ప్రసిద్ది చెందారు.
రూ.9 కోట్ల ఉంగరం
2024లో షేఖా మహ్రా తన భర్త షేక్ మానా బిన్ మోహమ్మద్ కు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా విడాకులు ప్రకటించింది. తర్వాత 2025లో ఆమె రాపర్ ఫ్రెంచ్ మోంటానాతో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 11 క్యారెట్ల డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరించారు. దీని విలువ 1.1 మిలియన్ డాలర్లు (రూ.9 కోట్లు) అని అంచనా.