
విశ్వగురు
శుభ మధ్యాహ్నం. ఇంతటి గౌరవాన్ని కల్పించినందుకు అరిజోనా విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులకు కృత జ్ఞతలు. గౌరవ డాక్టరేట్ అందుకున్నందుకు గర్వంగా ఉంది. మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం లభించడాన్ని కూడా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎన్నడూ అందుకోని దానిని...అంటే నిజమైన కాలేజీ డిగ్రీని యూనివర్సిటీ మీకు అందిస్తోంది.
నేను డిగ్రీ పూర్తి చెయ్యని సంగతి మీలో కొందరికి తెలిసి ఉండవచ్చు. మూడు సెమిస్టర్లు పూర్తి చేసిన తర్వాత, ‘మైక్రోసాఫ్ట్’ను ప్రారంభించేందుకు నేను చదువుకు స్వస్తి చెప్పేశాను. ఆ సంగతులనే నేను మీతో పంచుకోదలచుకున్నా. నేను పూర్తి చేయని గ్రాడ్యుయేషన్‌లో నాకు ఐదు సంగతులు చెప్పివుంటే బాగుండుననిపించింది.
రెండవ వృత్తి తప్పు కాదు!
మొదటిది – మీ జీవితం ఏకాంకిక కాదు. మీరు చేపట్టబోయే వృత్తి జీవితం గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలనే ఒత్తిడిలో బహుశా మీరు ఉండి ఉంటారు. అవి శాశ్వతమైన నిర్ణయాలుగా మీకు తోచవచ్చు. కానీ, అవి శాశ్వతమైనవి కావు. రేపు చేసేవి లేదా తదుపరి పదేళ్ళలో చేసేవి... మీరు జీవితాంతం చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు.
స్కూలు చదువును మధ్యలోనే ఆపేసినపుడు, ఇక జీవితమంతా మైక్రోసాఫ్ట్‌లోనే పనిచేస్తానని అనుకున్నాను. నేడు గమనిస్తే, సాఫ్ట్‌వేర్‌పై పనిచేయడాన్ని నేను ఇప్పటికీ ఇష్టపడతాను గానీ, వాతావరణ మార్పును నివారించే నవీకరణలను సృష్టించడం; ఆరోగ్యం, విద్యా రంగాలతో పాటు ఇతరత్రా అసమానతలను తగ్గించడంపైన పనిచేయడానికి నా సమయాన్ని వెచ్చిస్తున్నా.
ఇది నేను నా 22 ఏళ్ళ వయసప్పుడు ఊహించింది కాదు. కనుక, అవసరమైతే భవిష్యత్తులో మీ మనసు మార్చుకోవడంలో లేదా రెండవ వృత్తి జీవితాన్ని ఎంచుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు... నిజానికి, అది సరైన పని అనిపించుకుంటుంది.
సలహా అడగడానికి వెనుకాడొద్దు!
రెండు – ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదబ్బా అనుకుంటూ గందరగోళపడిపోనంత తెలివితేటలు మనకు ఎన్నడూ ఉండవు. కాలేజీ నుంచి బయటపడుతున్నప్పుడు, నాకు అవసరమైనవన్నీ నాకు తెలుసునని అనుకున్నా. కానీ, ఏదైనా నేర్చుకునేందుకు మొదటి అడుగు... మనకు తెలియని సంగతిని అక్కున చేర్చు కోవడంలోనే పడుతుంది. తెలిసున్నదానిపైనే దృష్టి కేంద్రీకరించే బదులు కొత్తవాటిని నేర్చుకునేందుకు ప్రయత్నించాలి.
ఒక్కరే స్వయంగా పరిష్కరించుకోలేని సమస్యను మనం మన వృత్తి జీవితంలో ఏదో ఒక దశలో ఎదుర్కొంటాం. అటువంటి సందర్భం ఎదురైనపుడు ప్రజ్ఞావంతులను వెతికిపట్టుకుని, వారి నుంచి పరిష్కార మార్గాలను గ్రహించండి. ఆ వ్యక్తి మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్న సహోద్యోగి కూడా కావచ్చు. మీతో కలిసి చదువు కున్న విద్యార్థి అయినా కావచ్చు. ఆ వ్యక్తి సరైన దృక్పథం కలిగి, మిమ్మల్ని భిన్నంగా ఆలోచించేటట్లు చేయగలిగినవాడై ఉండాలి. ఆ వ్యక్తి మనకు అవసరమైన రంగంలోని నిపుణుడైతే మరీ మంచిది.
నేను సాధించిన వాటన్నింటికీ కారణం, ఆ యా అంశాల్లో నాకన్నా ఎక్కువ పరిజ్ఞానం కలిగిన వారి సలహాలు, సూచనలు తీసు కోవడమే. మనకు సహాయపడేందుకు ముందుకొచ్చేవారు ఎప్పుడూ ఉంటారు. కాకపోతే మనం నిస్సంకోచంగా వారిని ఆశ్రయించడం ముఖ్యం.
పరిష్కరించడంలోనే పరమార్థం!
మూడు – ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించే దిశగా అడు గులు వేయండి. ప్రతి రోజూ కొత్త రకం పరిశ్రమలు, కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అవి మీకు జీవనోపాధి కల్పించడమే కాదు, కొత్త పుంతలు తొక్కేటట్లు ప్రోత్సహిస్తాయి. ఉదాహరణకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుంచి ప్రజలందరికీ ప్రయోజనం ఒనగూడే టట్లు మీరు మీ ప్రతిభా సంపత్తులను వినియోగించవచ్చు.
ఒక పెద్ద సమస్యను పరిష్కరించే అంశంలో నిమగ్నమైనపుడు, ఉత్తమమైన ఫలితాలను సాధించే విధంగా అది మీకు ఉత్సాహ ప్రోత్సాహాలను కూడా ఇస్తుంది. అదే మిమ్మల్ని మరింత సృజనా త్మకతతో వ్యవహరించేటట్లు చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, మీ జీవితానికి ఒక పరమార్థాన్ని కల్పిస్తుంది.
స్నేహితులే మీ నెట్‌వర్క్!
నాలుగు – స్నేహ బంధంలోని శక్తిని తక్కువ అంచనా వేయ వద్దు. స్కూలులో నాకొక మిత్రుడు ఉండేవాడు. సైన్స్ ఫిక్షన్ నవ లలు, కంప్యూటర్ మ్యాగజైన్లు వంటి నాకు ఇష్టమైన వ్యాపకాలు చాలా వాటిని అతనూ పంచుకునేవాడు. ఆ స్నేహం ఎంత ముఖ్య మైనదిగా పరిణమిస్తుందో నేను అప్పట్లో ఊహించలేదు. నా స్నేహి తుని పేరు పాల్ ఆలన్. మేం ఇద్దరం కలసి ‘మైక్రోసాఫ్ట్’ ప్రారంభించాం.
లెక్చరర్ పాఠం చెప్పేటపుడు తరగతి గదిలో పక్కన కూర్చున్నవాళ్ళు, ఆటపాటల్లో పాల్గొంటూ మీతో పోటీ పడేవాళ్ళు మీ తోటి విద్యార్థులు మాత్రమే కాదు, వారు మీ నెట్ వర్క్ అని గుర్తుంచుకోండి. వారు మీ భవిష్యత్ సహ–సంస్థాపకులు, సహో ద్యోగులు. వారు మున్ముందు మీకు అండగా నిలిచి, సమాచారాన్ని, సలహాలను ఇచ్చే గొప్ప వనరుగా పరిణమించ వచ్చు. ఈ రోజు మీరు వేదిక కింద ఎవరితో కలసి నడుస్తున్నారో, వారితో రానున్న కాలంలో మీరు వేదికను పంచుకోవచ్చు.
విరామం ముఖ్యమే!
నా చివరి సలహా ఏమంటే... నిజానికి ఈ సలహాను నేను ఎక్కువ పాటించి ఉండాల్సిందికానీ, దాన్ని ఒంట బట్టించుకునేందుకు నాకు చాలా కాలం పట్టింది. మరేమీ లేదు... మీరు మధ్య మధ్యలో కొద్దిగా విరామం తీసుకున్నంత మాత్రాన బద్ధకస్తుడు ఏమీ అయిపోరు. నేను మీ వయసులో ఉన్నపుడు, కొన్నాళ్ళు సేద దీరడం మంచిదని నమ్మేవాడిని కాదు.
నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరినీ అదనంగా గంటలకొద్దీ కూర్చోబెట్టేవాడిని. మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన కొత్తల్లో, ఎవరు తొందరగా వెళ్ళిపోతున్నారు, ఎవరు పని గంటలు ముగిసినా చాలాసేపు ఉంటున్నారు అని గమనించేవాడిని. కానీ, కొంత వయసు మీద పడిన తర్వాత – ముఖ్యంగా నేను తండ్రినయ్యాక – జీవితమంటే పని ఒక్కటే కాదని, ఇంకా చాలా ఉందని గ్రహించాను.
ఈ పాఠం నేర్చుకునేందుకు మీరు నాలాగా చాలా కాలం వేచి ఉండకండి. సంబంధ బాంధవ్యాలను నిలబెట్టుకునేందుకు, విజ యాలను వేడుక చేసుకునేందుకు, కష్టనష్టాల నుంచి తిరిగి శక్తిని కూడగట్టుకునేందుకు కొంత సమయాన్ని వెచ్చించండి.