
చెన్నై/కాంచీపురం: మధ్యప్రదేశ్‌లో 20 మంది వరకు చిన్నారుల మృతికి కారణమని భావిస్తున్న దగ్గు మందు తయారీ ప్లాంట్‌ను తమిళనాడు ప్రభుత్వం మూసివేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో సిరప్ కోల్డ్రిఫ్ తాగిన చిన్నారులు కిడ్నీలు ఫెయిలై మృత్యువాత పడుతున్నారన్న ఆరోపణల తో ఈ సిరప్ విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీనే నిషేధం విధించింది. మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ను తొలగించాలని స్పష్టం చేసింది.
సిరప్‌లో ప్రమాదకర రసాయనా లున్నా యంటూ పరీక్షలు జరిపిన రాష్ట్ర ఔషధ విభాగం ప్రకటించింది. తక్షణమే కోల్డ్రిఫ్ ఉత్పత్తిని నిలిపి వేయాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మందును మధ్యప్రదేశ్, కేరళ కూడా నిషే ధించాయి. కోల్డ్రిఫ్ సిరప్ విక్రయాలను నిలిపివే యా లంటూ పుదుచ్చేరి, ఒడిశా ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది.
కోల్డ్రిఫ్‌లో ప్రమాదకర డై ఇథిలీన్ గ్లైకాల్ 48.6 శాతం కనిపించడంపై వివరణ ఇవ్వాలని కంపెనీకి రెండో సారి నోటీసు ఇచ్చామని మంత్రి మా సుబ్రమణియన్ చెప్పారు. ఇప్పటికే ఇదే విషయంలో ఈ నెల 3న మొదటి నోటీసు పంపించామన్నారు. కంపెనీ వివరణ ఎలా ఉన్నా చట్టపరమైన క్రిమినల్ చర్యలు మాత్రం తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నోటీసులకు స్పందించని ఆ కంపెనీ పూర్తిస్థాయి మూసివేతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.
చెన్నైలో మధ్యప్రదేశ్ సిట్
కోల్డ్రిఫ్ మరణాలపై దర్యాప్తునకు ఏర్పాటైన మధ్యప్రదేశ్ సిట్ బృందం చెన్నైకి చేరుకుంది. చెన్నైలోని ఫార్మా కంపెనీ కార్యాలయానికి వెళ్లి, అవసరమైన పత్రాలను సేకరించింది. అదేవిధంగా, కాంచీపురంలోని సీల్ వేసిన కంపెనీ యూనిట్‌ను పరిశీలించింది. అవసరమైన వివరాలను తెల్సుకుంది.