ఢిల్లీ: దేశంలో భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. ఆదివారం అహ్మదాబాద్‌లో పాకిస్థాన్ గూఢాచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలను గమనిస్తున్నామని, తాజాగా ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారిని పట్టుకున్నట్లు ఏటీఎస్ వెల్లడించింది.
దేశంలో ఉగ్రకుట్రకు పాల్పడేలా ఈ ఉగ్రవాదులు ఆయుధాల్ని మార్పిడి చేసేందుకు గుజరాత్‌కు వచ్చారు. గుజరాత్ కేంద్రంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయుధాల్ని సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. సరఫరా అనంతరం ఉగ్రకుట్ర చేసేలా ప్లాన్ చేసేందుకు యత్నించారు. ఆ ప‍్రయత్నాల్లో ఉండగా.. ఏటీఎస్ ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అనంతరం దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో ఉగ్రమూకలు లక్ష్యంగా ఎంచుకున్న ప్రదేశాల్ని,వ్యక్తులు గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు ఏటీఎస్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్ ATS ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాకు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్టు చేసింది. వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన మహిళ కాగా, ఆమె పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలున్న ఆన్‌లైన్ టెర్రర్ మాడ్యూల్‌ను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూలై 22న ఫర్దిన్ షేక్, సైఫుల్లా ఖురేషి, మొహమ్మద్ ఫైక్, జీషన్ అలీ అనే నిందితులను అల్-ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెంట్ భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. జీషన్ అలీ వద్ద నుండి అక్రమ సెమీ ఆటోమేటిక్ పిస్టల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా నోయిడాలోని జీషన్ అలీ నివాసంలో ఏటీఎస్ ఆపరేషన్ నిర్వహించి మరిన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ముగ్గురు ఉగ్రమూకల్ని అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురు దేశంలో హింసను ప్రేరేపించడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడం, ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక చర్యలను ప్రోత్సహించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


