కోతులు.. అత్యంత తెలివైన జంతువులు.. వాటికి జీవవైవిధ్యంలో, మానవ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన కోతులు భూమిపై గల అత్యంత ముఖ్యమైన జంతు సమూహాలలో ఒకటి. అరణ్యాలలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, విత్తనాలను వెదజల్లే ఏజెంట్‌లుగా అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కోతులు ప్రపంచంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న కోతుల దినోత్సవం (Monkey Day) జరుపుకుంటారు.
సరదాగా మొదలై..
కోతుల దినోత్సవం అనేది కేవలం కోతులను మాత్రమే కాకుండా, చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్‌లతో సహా అన్ని రకాల సిమియన్‌లను (ప్రైమేట్‌లను) గుర్తుచేస్తుంది. మానవ కుటుంబ వృక్షంలో ప్రైమేట్స్ ఒక భాగం. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన ఈ జాతుల పట్ల మనకున్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనకు ఒక అవకాశం కల్పిస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమైన ఈ దినోత్సవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే వార్షికోత్సవంగా మారింది.

కేలండర్‌లో సరదాగా రాయగానే..
ఈ ప్రత్యేక దినోత్సవ ఆవిర్భావం 2000లో జరిగింది. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన కాసే సారో, ఎరిక్ మిల్లికిన్ అనే విద్యార్థులు ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. డిసెంబర్ నెలలో సెలవు రోజులను వెదుకుతూ వారు క్యాలెండర్‌లో 14వ తేదీన మంకీ డే అని రాశారు. ఈ విషయాన్ని వారు తోటి స్నేహితులకు తెలిపారు. దీంతో వారంతా కోతుల తరహా ప్రత్యేక దుస్తులు ధరించి, గెంతుతూ ఉల్లాసంగా గడిపారు. ఈ విధంగా వినోదంగా మొదలైన ఈ దినోత్సం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
మంకీ డే నాడే ‘కింగ్ కాంగ్’ విడుదల
సారో, మిల్లికిన్ ఈ దినోత్సవం సందర్భంగా కొన్ని కళాకృతులు తయారుచేశారు. వీటిని ఆన్‌లైన్‌లో ప్రచురించడం ద్వారా ‘మంకీ డే’ భావన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి దారితీసింది. పీటర్ జాక్సన్ తీసిన ‘కింగ్ కాంగ్’(2005) మంకీ డే ఐదవ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది. ఇది మంకీడే ప్రాముఖ్యతను మరింతగా పెంచింది. మొదట సరదాగా ప్రారంభమైన మంకీ డే ఇప్పుడు పూర్తి స్థాయి ప్రపంచ ఆపరేషన్‌గా రూపాంతరం చెందింది. నేషనల్ జియోగ్రాఫిక్, స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్, గ్రీన్‌పీస్ వంటి సంస్థలు ఈ రోజున కోతులు ఎదుర్కొంటున్న ముప్పుపై అవగాహన కల్పిస్తున్నాయి. (Facts About Monkeys In Telugu)
కోతులలో సుమారు 260 జాతులు ఉండగా, వాటిలోని పలు రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. బార్బరీ మకాక్‌ల జనాభా గత 24 ఏళ్లలో 50 శాతానికి తగ్గింది. మంకీ డే అనేది కేవలం ఉల్లాసానికి మాత్రమే కాకుండా, కోతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కలిగించేందుకు కూడా దోహపదపడుతుంది.

కోతులు.. 10 అద్భుత విషయాలు
విభిన్న జాతులు (Diversity): ప్రపంచవ్యాప్తంగా సుమారు 260కి పైగా రకాల కోతి జాతులు ఉన్నాయి. వీటిని ప్రధానంగా ‘పాత ప్రపంచ కోతులు’ (ఆఫ్రికా, ఆసియా), ‘కొత్త ప్రపంచ కోతులు’ (దక్షిణ, మధ్య అమెరికా)గా విభజిస్తారు.
తోక ప్రాముఖ్యత (Prehensile Tails): కొత్త ప్రపంచ కోతులు (ఉదాహరణకు సాలీడు కోతులు) కొన్నిటికి ప్రత్యేకమైన తోకలు ఉంటాయి. ఇవి చెట్ల కొమ్మలను పట్టుకోవడానికి లేదా ఆహారాన్ని తీసుకునేందుకు ఒక అవయవంలా పనిచేస్తాయి.
సమాజ జీవనం (Social Lives): కోతులు అత్యంత సామాజిక జీవులు. అవి సమూహాలుగా (ట్రూప్స్) జీవిస్తాయి. కొన్నిచోట్ల వందల కోతులు కలిసివుంటాయి. ఈ సమూహాలలో వాటి మధ్య బంధాలు ఉంటాయి.
శుభ్రం చేసుకోవడం (Grooming): కోతులు తమ సమూహంలోని ఇతర కోతులను శుభ్రం చేస్తుంటాయి. ఇది వాటి సామాజిక బంధాలను, పరస్పర నమ్మకాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.

బుద్ధి కుశలత (Intelligence): కోతులు చాలా తెలివైనవి. అవి సమస్యలను పరిష్కరించుకుంటాయి. వివిధ పరికరాలను ఉపయోగించగలవు. ఉదాహరణకు పండ్లను, కాయలను ముక్కలు చేసేందుకు రాళ్లను వినియోగిస్తాయి.
వివిధ రకాల ఆహారం (Varied Diet): కోతులు సాధారణంగా పండ్లు, ఆకులు, పువ్వులు, కీటకాలు చిన్న జంతువులను తినే సర్వభక్షకాలు (Omnivores). వాటి ఆహారం జాతిని బట్టి, అవి నివసించే ప్రాంతం ప్రకారం మారుతుంటుంది.
ప్రత్యేకమైన కమ్యూనికేషన్ (Unique Communication): కోతులు వివిధ రకాల శబ్దాలు, ముఖ కవళికలు, శరీర భాష ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. ప్రమాదాన్ని సూచించడానికి లేదా ఆహారం గురించి తెలియజేయడానికి ప్రతి జాతికి ప్రత్యేకమైన అరుపులు ఉంటాయి.
చిన్న కోతి (Pygmy Marmoset): పిగ్మీ మార్మోసెట్ అనేది ప్రపంచంలోనే అత్యంత చిన్న కోతి జాతి. ఇది కేవలం 5-6 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. 100 గ్రాముల కంటే తక్కువ బరువు ఉంటుంది.
నిద్రించే విధానం (Sleeping Habits): చాలా కోతులు చెట్లపై నిద్రిస్తాయి. మాంసాహార జీవుల నుంచి సంరక్షణకే అవి అలా చేస్తుంటాయి. కొన్ని కోతులు నిద్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకుంటాయి.
మానవులకు దగ్గర సంబంధం (Close to Humans): కోతులు, ముఖ్యంగా పాత ప్రపంచ కోతులు (మకాక్‌లు, బబూన్‌లు వంటివి), మానవులకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.
ఇది కూడా చదవండి: Delhi Pollution: తొలగని అంధకారం.. వైద్యుల హెచ్చరికలు


