శబరిమల దేవాలయాన్ని సన్నిధానం అని కూడా అంటారు. సన్నిధానం అనేది దివ్య స్థలం లేదా దేవుడు నివసించే ప్రదేశం. శబరిమల ఆలయం భూమి మట్టం నుంచి 40 అడుగుల ఎత్తులో పీఠభూమిపై ఉంది. దీనిలో బంగారు పూతతో కూడిన పైకప్పుతో ప్రధాన ఆలయం (గర్భగుడి), దాని పైన నాలుగు గోపురాలు, రెండు మండపాలు (గాజెబో లాంటి నిర్మాణాలు), బలిపీఠం (యజ్ఞ శిలా పీఠాలు), బలికల్పుర (పూజా నైవేద్యాలు చేయడానికి రాతి నిర్మాణం) బంగారం తాపడం చేసిన ధ్వజస్తంభం తదితరాలు ఉంటాయి.
అలాగే ఈ సన్నిధానానికి దారితీసే పతినెట్టాంపడి లేదా పద్దెనిమిది మెట్లు బంగారంతో తాపడం చేసి ఉంటాయి. పద్దెనిమిది మెట్ల అడుగు భాగంలో ఇద్దరు ద్వారపాలకులు - వలియ కడుత స్వామి, కరుప్ప స్వామి ఉంటారు. వావర్ నడ కూడా దీనికి సమీపంలోనే ఉంది. అలాంటి పవిత్ర ప్రదేశాన్ని దర్శంన చేసుకునేందుకు పెద్దసంఖ్య మాలధారులు ప్రతి ఏటా పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్నవారి సంఖ్య అధికంగా ఉంటుందనేది అధికారిక వర్గాల సమాచారం. మరి ఈ నేపథ్యంలో శబరిమల సన్నిధానంలో యాత్రికుల పూజ, వసతి నిమిత్తమై ఎలాంటి వసతి సౌకర్యాలు ఉంటాయి వంటి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
శబరిమల సన్నిధానం వద్ద వసతి సౌకర్యాలు ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు, అలాగే దేవస్వం బోర్డు గుర్తింపు పొందిన కేంద్రాలలో స్పాట్ బుకింగ్ కూడా అందుబాటులో ఉంది. భక్తులు ఆన్‌లైన్‌లో దర్శనం స్లాట్‌లు, పూజలు, వసతిని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. సమీపంలో అనేక హోటళ్ళు, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి కూడా.
శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాలు
సన్నిధానంలో యాత్రికుల బస కోసం వివిధ భవనాల్లో 540 గదులు ఉన్నాయి.
శబరి గెస్ట్ హౌస్లో మాత్రమే 56 గదులు ఉన్నాయి, వీటితో పాటు 5 కాటేజీలు, 12 విడిషెడ్లు ఉన్నాయి.
వివిధ విభాగాల అధికారులకు మొత్తం 146 గదులు కేటాయించగా, పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేక బ్యారక్ నిర్మించారు.
ఎలా బుక్ చేసుకోవాలంటే..
www.onlinetdb.com ద్వారా ఆన్‌లైన్‌లో గదులు, ప్రసాదాలను (వాళిపాడు) బుక్ చేసుకోవచ్చు.
దాంతోపాటు పూజకు సంబంధించి.. ఇలాంటి ఆఫర్లను కూడా బుక్ చేసుకోవచ్చు. అవేంటంటే..
ఉదయాస్తమాన పూజ
పడి పూజ
సహస్రకలసం
కలశాభిషేకం
ఉష పూజ
ఉచ్ఛ పూజ
అథాళ పూజ
నెయ్యాభిషేకం
వీటిని వర్చువల్ క్యూ టికెట్ తోపాటు బుక్ చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక: 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బుకింగ్ అవసరం లేదు.
దర్శన సమయాలు
దర్శనం కోసం ఆలయం తెల్లవారుజామున 3:00 గంటలకు తెరుచుకుంటుంది.
ఉచ్ఛ పూజ తర్వాత మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడుతుంది.
మధ్యాహ్నం 3:00 గంటలకు తిరిగి తెరుచుకుంటుంది.
రాత్రి 11:00 గంటలకు హరివరాసనం పారాయణంతో చివరి ముగింపు.
ఈ ఆలయం రోజుకు 18 గంటలు దర్శనం కోసం తెరిచి ఉంటుంది.
మధ్యాహ్నం 1 గంటలకు ఆలయం మూసివేసినప్పుడూ.. అలాగే రాత్రి మూసివేత తర్వాత కూడా..అప్పటికే క్యూలో ఉన్న యాత్రికులు 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. తర్వాత ఆలయం దర్శనం కోసం తిరిగి తెరిచినప్పుడు వారు ఉత్తర ద్వారం గుండా వెళ్ళవచ్చు. ఇది భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేశారు.
యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన పథకాలు..
గుండెపోటు ఉపశమన పథకం
తీర్థయాత్ర సమయంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా మరణించే యాత్రికుల కుటుంబాలకు దాదాపు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వర్చువల్ క్యూ బుకింగ్‌లో రూ.5 రుసుము అదనంగా జోడించారు. అయితే ఈ చెల్లింపు తప్పనిసరి కాదు.
కేరళ అంతటా బీమా కవరేజ్
వర్చువల్ క్యూ ద్వారా బుక్ చేసుకునే యాత్రికులందరికీ ఎటువంటి ప్రీమియం లేకుండా రూ. 5 లక్షల ప్రమాద మరణ బీమా కవరేజ్ లభిస్తుంది.
ఒక యాత్రికుడు మరణిస్తే :
కేరళలో అంబులెన్స్ ఖర్చులు: రూ. 30,000 వరకు
ఇతర రాష్ట్రాలకు అంబులెన్స్ ఖర్చులు: రూ. 1,00,000 వరకు ఈ ఖర్చులను దేవస్వం బోర్డు భరిస్తుంది.
నీలక్కల్ వద్ద పార్కింగ్
పంప నుంచి 23 కి.మీ దూరంలో ఉన్న నీలక్కల్ శబరిమల యాత్రికులకు ప్రధాన పార్కింగ్ హబ్. ఇక్కడ సుమారు 8,500 వాహనాలకు స్థలం ఉంది.
పంపా వద్ద , హిల్స్ స్టాప్, చక్కుపాలెం వద్ద పరిమిత పార్కింగ్ అందుబాటులో ఉంది.
ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపు వ్యవస్థ
నిలక్కల్ , చక్కుపాలెం, హిల్టాప్ వద్ద పార్కింగ్ ఫీజులను ఫాస్టాట్యాగ్ ద్వారా చెల్లించవచ్చు:
బస్సులు: రూ. 100
మినీ బస్సులు: రూ. 75
14 సీట్ల వరకు వాహనాలు: రూ. 50
4 సీట్లు రూ. 30
ఆటో - రిక్షాలు: రూ.15
చివరగా శబరిమలలో వసతి రూ.80 నుంచి అదుబాటులో ఉంది. గది స్థాయిని బట్టి రూ.2,200 వరకు ఫీజు వసూలు చేస్తారు.గదులు బుక్ చేసుకోవాలను కునే యాత్రికులకు ఆన్‌లైన్ సేవల కోసం నమోదు చేసుకోవడానికి మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా అవసరం.
గదిని ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో మీరు అందించిన అదే ఫొటో సహా IDని తీసుకెళ్లాలి. అలాగే ఒక రోజులో గరిష్టంగా 20వేల మంది భక్తులకు రియల్ టైమ్ బుకింగ్ ద్వారా దర్శనం అవకాశం కల్పిస్తోంది ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఒకే సమయంలో ఎక్కువమంది వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడం వల్ల ఒక్కోసారి సర్వర్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని, దీన్న భక్తులందరు గమనించగలరు అంటూ..ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు విన్నవించింది.
(చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..)


