అనూహ్య పరిస్థితుల్లో భార్య బిడ్డలు చనిపోయి కనిపించారు. తీరని దుఃఖంలో ఉండగానే నువ్వే నిందితుడని బంధువులు ఆరోపించారు. అనుమానాలున్నాయంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్ల తరువాత అసలు నిజం తెలిసింది. సంచలనంగా మారిన ఈ స్టోరీ వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
2017, మార్చి 23, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్‌మెంట్‌లోశవాలై కనిపించారు. మహిళ భర్త నర్రా హనుమంతరావునే ప్రాథమికంగా నిందితుడిగా భావించారు. కానీ అనూహ్యం ఎనిమిదేళ్ల తరువాత నజీర్ హమీద్ అనే వ్యక్తిపై అభియోగాలు మోసారు. న్యూజెర్సీలోని ఒక కంపెనీలో శశికళ నర్రా భర్త సహోద్యోగే ఈ హత్యలకు పాల్పడినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు.
శశికళ, అనిష్ హత్య
ఏపీకి చెందిన నర్రా హనుమంతరావు న్యూజెర్సీలోని మాపుల్ షేడ్‌లోని ఫాక్స్ మేడో అపార్ట్‌మెంట్స్‌లో భార్య శశికళ నర్రా(38), 6 ఏళ్ల కుమారుడు అనిష్‌తో కలిసి ఉండేవారు. ఒక రోజు ఆఫీసునుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు ఒళ్లంతా రక్తమోడుతూ తీవ్రమైన కత్తిపోట్లతో చనిపోయి కనిపించారు. వెంటనే హనుమంత రావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు హనుమంతరావును అరెస్ట్ చేశారు. ఈ సమయంలో దర్యాప్తు అధికారులు తమ విచారణలో భాగంగా సంఘటనా స్థలంనుంచి రక్తపు మరకల నమూనాలను సేకరించి, డీఎన్‌ఏ పరీక్షలు చేయించారు. అయితే అది హనుమంతరావు డీఎన్ఏతో మ్యాచ్ కాకపోవడంతో ఇది మరో మలుపు తిరిగింది.
ఎలా ఛేదించారంటే..
బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పాట్రిక్ థోర్న్టన్ అందించిన వివరాల ప్రకారం హనుమంతరావు ఇంటికి సమీపంలోనే ఉండే హమీద్ మధ్య గొడవలు ఉన్నట్టు గురించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న సమయంలో హను నర్రాను వేధించినట్లు గతంలో నజీర్ హమీద్ పై ఆరోపణలు రావడంతో ఆ వైపుగా దర్యాప్తు మెుదలుపెట్టారు. డీఎన్ఏ నమూనాను సేకరించాలనే ఉద్దేశంతో అధికారులు 2024లో కోర్టుకు వెళ్లారు. కాగ్నిజెంట్ కంపెనీ,హమీద్‌కు జారీ చేసిన ల్యాప్‌టాప్‌ను తమకు పంపమని కోరారు. చివరికి ల్యాప్‌టాప్ నుండి డీఎన్ఏ సేకరించారు అధికారులు. నేరస్థలంలో దొరికిన నమూనాతో హమీద్ డీఎన్ఏ సరిపోలడంతో గుట్టు రట్టయింది.
మరోవైపు జంట హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ ఇండియాకు చెక్కేశాడు. అయినా కాగ్నిజెంట్ ఉద్యోగిగా కొనసాగాడు. అంతేకాదు అమెరికా పోలీసులు హమీద్ డీఎన్ఏ కోసం చాలాసార్లు ప్రయత్నించారు. భారతీయ అధికారుల ద్వారా సంప్రదించినా స్పందించలేదు. చివరికి అతడి ల్యాప్‌ట్యాప్ మీద నమూనాల ఆధారంగా కేసును ఛేదించారు. మరోవైపు హమీద్‌ను అమెరికాకు రప్పించేందుకు భారత విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరు
ఈ దారుణమైన హత్యల వెనుక హమీద్ ఉద్దేశం ఏమిటనేది దర్యాప్తు అధికారులకు స్పష్టత లేదు కానీ హనుమంతరావుపై కోపంతోనే అతడి భార్య శశికళ, కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇన్వెస్టర్ల క్యూ : కొత్త ఐటీ నగరం వచ్చేస్తోంది!


