భారత్‌పై అమెరికా మరిన్ని టారిఫ్‌లు విధిస్తే అగ్రరాజ్యానికి మన ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనితో ఎగుమతిదార్లు మరింత వేగంగా ఇతర మార్కెట్లకు ఎగుమతులను పెంచుకోవాల్సి వస్తుందని వివరించారు.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందున భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో నిపుణులు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపారు. 2025 మే–నవంబర్ మధ్య కాలంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 20.7 శాతం తగ్గాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) పేర్కొంది. మన ఎగుమతులపై ఇప్పటికే 50 శాతం టారిఫ్‌లు అమలవుతుండగా వాటిని ఇంకా పెంచితే, ఎగుమతులు మరింత భారీగా పడిపోవచ్చని వివరించింది.
‘చైనా తరహాలో అమెరికాపై భారత్‌కి పైచేయేమీ లేదు. నిజానికి రష్యా క్రూడాయిల్‌ని చైనాయే అత్యధికంగా కనుగోలు చేస్తోంది. కానీ పరిణామాలకు భయపడి దాని గురించి అమెరికా పట్టించుకోవడం లేదు. భారత్ మాత్రం అమెరికా నుంచి పెట్రోలియం క్రూడ్, ఇతర ఉత్పత్తుల దిగుమతులను పెంచుకుంది. కానీ దీన్ని అమెరికా పట్టించుకోదు‘ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.


