అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే.. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను తీసుకెళ్లినట్లుగానే తనను ఎత్తుకెళ్లాలని, ఆ క్షణం కోసం తాను ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు వెటకారంగా సవాల్ విసిరారాయన.
వెనెజువెలా దాడి తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. కొలంబియాను డ్రగ్స్ విక్రయించే వ్యక్తి పాలిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ‘‘కొలంబియా బాగా నష్టపోయింది. ఓ చెడ్డోడు ఆ దేశాన్ని పాలిస్తున్నాడు’’ అని కామెంట్ చేశాడు. పైగా కొలంబియాపై ఆపరేషన్ ప్రారంభించడం తనకు మంచిగా అనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది సహజంగానే అవతలి వాళ్లను కోపం తెప్పించింది.
ట్రంప్ బెదిరింపులను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా ఖండించారు. ‘‘నేను ఇక‍్కడే మీ కోసం ఎదురు చూస్తుంటా. దమ్ముంటే వచ్చి మదురోను పట్టుకున్నట్లు నన్ను పట్టుకోండి. అది అంత సులువు అనుకుంటే వాళ్లు పొరబడినట్లే. ఒకవేళ కొలంబియాపై అమెరికా గనుక దాడులు చేస్తే.. ఇక్కడి పర్వతాల్లో ఉండే రైతులు ఆయుధాలు పడతారు. తాము గౌరవించే అధ్యక్షుడ్ని బంధిస్తే ఈ దేశ ప్రజలు చిరుతల్లా ముందుకు దూకుతారు’’ అంటూ ప్రకటించారు. నేను మళ్లీ ఆయుధం ముట్టుకోనని గతంలో ప్రమాణం చేశాను. కానీ నా మాతృభూమి కోసం అవసరమైతే నేను మళ్లీ ఆయుధం చేపడతా అంటూ భావోద్వేగంగా మాట్లాడారాయన.
గుస్తావో ఫ్రాన్సిస్కో పెట్రో ఉర్రెగో (Gustavo Petro) ఒకప్పుడు M-19 గెరిల్లా ఉద్యమంలో సభ్యుడుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయుధాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి, బొగోటా మేయర్, సెనేటర్‌గా పనిచేశారు. 2022లో ఆయన కొలంబియాకు తొలి వామపక్ష అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1990లలో నిరాయుధీకరణ సమయంలో ఆయన మళ్లీ ఆయుధం ముట్టనంటూ ప్రతినబూనారు.
గత శనివారం(జనవరి 3న) వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికాకు బందీలుగా పట్టుకెళ్లారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల కేసుల్ని మోపింది. డ్రగ్స్ ముఠాకు మదురో నాయకుడని.. యూఎస్‌లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని ట్రంప్ ఆరోపించారు. అయితే.. వెనెజువెలాలో ఉండే చమురు, అదరుదైన ఖనిజాల కోసంమే ట్రంప్ ఈ కుట్రకు తెరదీశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.
అయితే.. అమెరికా సైనిక చర్య కంటే ముందు ఒక కార్యక్రమంలో మదురో మాట్లాడుతూ.. ‘‘దమ్ముంటే, నన్ను పట్టుకెళ్లండి’’ అంటూ ట్రంప్‌కు సవాల్ చేశారు. ఆ తర్వాతే అమెరికా వెనిజులా రాజధాని కారకస్‌పై దాడులు చేసి మదురోను బంధించింది. ఈ నేపథ్యంలో.. కొలంబియా అధ్యక్షుడి సవాల్‌కు ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.


