న్యూఢిల్లీ: పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా, మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రెండు కేసుల్లో ప్రధాన నిందితుడైన భారత్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా ప్రభుత్వం బుధవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత భారత దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు అన్మోల్ బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఢిల్లీ పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం చట్టపరంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తమ ఆధీనంలో ఉన్న అన్మోల్ బిష్ణోయ్ ఫొటోను ఎన్‌ఐఏ తొలిసారి విడుదల చేసింది.
పంజాబ్‌లోని ఫాజిల్కాకు చెందిన అన్మోల్ బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని విదేశాల నుంచి నడిపించాడు. 2022లో సిద్ధూ (Sidhu Moosewala) మూసేవాలాను మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గం మధ్యలో అడ్డగించిన దుండగులు అతడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిద్దూమూసేవాలా హత్యకేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు.
సిద్ధూమూసే వాలా హత్య అనంతరం అన్మోల్ బిష్ణోయ్ ఫేక్ పాస్‌పోర్టుతో భారత్ నుంచి అమెరికా వెళ్లాడు. అక్కడి పోలీసులు అన్మోల్ బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో పలు నేరాల్లో అన్మోల్ ప్రమేయం ఉండడంతో అమెరికా ప్రభుత్వం అతడికి జైలు శిక్ష విధించింది. నాటి నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
ఈ క్రమంలో 18 కేసుల్లో ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో అన్మోల్‌ను విచారణ నిమిత్తం అతడిని తమకు అప్పగించాలని భారత్ సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో అమెరికా అన్మోల్‌ను బహిష్కరించడం, ఆపై భారత్‌కు తరలించడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న అన్మోల్‌ను ఎన్‌ఐఏ అతనిపై మొత్తం నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టనుంది. అన్మోల్‌తో పాటు మోస్ట్ వాటెండ్ లిస్టులో ఉన్న 199 మందిని సైతం అమెరికా భారత్‌కు అప్పగించింది.


