ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటించనన్నారు. ఈ నెల 22, 23(శని, ఆది) తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న జీ20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. జోహాన్స్‌బర్గ్‌లో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌లోనూ పాల్గొంటారని పేర్కొంది. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
ఈ సమావేశంలో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి సహకారం, వాతావరణ మార్పు, ఆహారం, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత్ తాజాగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలతో పాటు అంతర్జాతీయ సహకార బలోపేతంపై ప్రధానిగా మోదీ అభిప్రాయాలను ప్రపంచ నేతలకు వివరించనున్నారు. అలాగే, జీ20 సభ్య దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరగనున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది.


