
ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో..
నెన్నెల: తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ కొడుకు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నెన్నెల మండలం గంగారాం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (21) ఇంటర్ వరకు చదువుకున్నాడు. అనిల్ తల్లి ఆవుడం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మంగళి తిరుపతితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఈ విషయమై అనిల్ తండ్రి తన భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. ఈ విషయం తెలిసిన అనిల్ కూడా తల్లిని మందలించాడు. అంతేకాకుండా తిరుపతి ఇంటికి వెళ్లి హెచ్చరించాడు. అయితే తిరుపతి వినకపోగా, అనిల్‌నే చంపుతానని బెదిరించాడు. తల్లి తీరు మారకపోవడం, తిరుపతి బెదిరింపులతో మనస్తాపం చెందిన అనిల్.. బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీసుకుని, మిత్రులు, కుటుంబ సభ్యులకు పంపించాడు. వారు అనిల్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడి బంధువులు గురువారం అనిల్ మృతికి కారణమైన తిరుపతి ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి ముందే ఆందోళన చేశారు. తిరుపతి అప్పటికే ఇంటికి తాళం వేసి పారిపోయాడు. దీంతో తాళం బద్దలుకొట్టి సామాగ్రిని ధ్వంసం చేసి కిచెన్‌షెడ్‌కు నిప్పు పెట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, తిరుపతిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హామీ ఇవ్వడంతో అనిల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.